ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకు సేవలు పొందటం సులభతరం అయిపోయింది. నగదు బదిలీతో పాటు బిల్లుల చెల్లింపు, పలు ఇతర సేవలు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇంటి నుంచే సౌకర్యవంతంగా చేసుకోవచ్చు. బ్యాంకుకు వెళ్లి వరుసలో నిలబడే శ్రమను ఇది తగ్గించింది.
ఆన్లైన్ బ్యాంకింగ్ సౌకర్యవంతంగా మారినప్పటికీ సైబర్ మోసాల నుంచి రిస్కు మాత్రం పొంచి ఉంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వీటిని నివారించుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
పాస్‌వర్డ్‌ల మార్పు
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాలో మొదటి సారి లాగిన్ అయినప్పుడు బ్యాంకు ఇచ్చిన పాస్‌వర్డ్‌ను ఉపయోగించినట్లయితే దానిని మార్చుకోవాలి. ప్రతి నెలా లేదా రెండు నెలలకు ఓ సారి పాస్వర్డ్ మార్చాలి. దీనివల్ల ఖాతా వివరాలు వేరే వారికి తెలిసినా కూడా లాగిన్ అవ్వటం వీలు కాదు. పాస్‌వర్డ్‌ను ఎప్పుడూ గోప్యంగా ఉంచుకోవాలి. ఇతరులతో షేర్ చేయడం వల్ల మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పబ్లిక్ కంప్యూటర్లతో లావాదేవీలొద్దు..
ఇంటర్నెట్ సెంటర్లు, లైబ్రరీల్లో సాధారణ కంప్యూటర్లను ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం వాడకపోవటమే ఉత్తమం. ఇలాంటి ప్రదేశాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ ఖాతా వివరాలు ఇతరులు చూసే లేదా తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి కంప్యూటర్లలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడాల్సి వస్తే.. బ్రౌజింగ్ హిస్టరీ, క్యాషేను డిలీట్ చేయాలి.
లాగిన్ ఐడీ, పాస్వర్డ్ సేవ్ చేయమని.. మీ బ్రౌజర్ అనుమతి కోరితే అందుకు అనుమతించకూడదు. అలాగే పబ్లిక్ కంప్యూటర్లను ఉపయోగించినప్పుడు ప్రైవేట్ విండో ఉపయోగించుకోవటం ఉత్తమం.
వివరాలు ఎవరికీ చెప్పొద్దు
ఫోన్లో కానీ, ఈ-మెయిల్ ద్వారా కానీ మీ బ్యాంక్.. ఖాతా, పిన్ వంటి వివరాలు అడగదు. కాబట్టి.. బ్యాంక్ పేరు చెప్పుకుని ఎవరైనా ఓటీపీ, పాస్వర్డ్ కోసం కాల్స్, మెసేజెస్ చేస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు.