Russian crude oil discount: దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఎన్నికలకు ముందు వార్తలు వచ్చాయి. అయితే, ఇంతవరకు ధరలు పెరిగింది లేదు. మరోవైపు, ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో ముడిచమురు ధరలు సరికొత్త గరిష్ఠానికి చేరుకుంటున్నాయి. అటు, రష్యాపై ఆంక్షలు ఉన్నందున ఆ దేశంలో చమురు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ పరిణామాలను భారత్ అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
రష్యా నుంచి చౌకగా..
రష్యా నుంచి తక్కువ ధరకే ముడి చమురును కొనుగోలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. డాలర్లలో కాకుండా రూపాయి-రూబుల్ మారకాన్ని బట్టి లావాదేవీలు జరపాలని అనుకుంటోంది. ఈ విషయాన్ని ఇద్దరు కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
India Russia crude oil imports
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే తమపైనా ఆంక్షలు తప్పవేమో అన్న అనుమానాలతో పలు దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. అయితే, ఆంక్షల భయాలు భారత్‌ను నిలువరించలేవని అధికారులు చెబుతున్నారు.
"చమురుతో పాటు చాలా ఉత్పత్తులను భారీ డిస్కౌంట్‌కు రష్యా ఆఫర్ చేస్తోంది. డిస్కౌంట్‌తో చమురును కొనుగోలు చేయడం మాకు సంతోషమే. అయితే, ట్యాంకర్ల కొరత, ఇన్సూరెన్స్, చమురు మిశ్రమాలకు సంబంధించి కొన్ని చిక్కులు ఉన్నాయి. ఇవి పరిష్కారమైతే డిస్కౌంట్ ఆఫర్ తీసుకుంటాం."
-కేంద్ర ప్రభుత్వ అధికారులు
అయితే, రష్యా నుంచి ఎంత చమురును దిగుమతి చేసుకోనున్నారనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఎంత డిస్కౌంట్ లభిస్తోందనే విషయంపైనా వివరాలు తెలియజేయలేదు.
India Crude oil imports
భారత్ తన ఇంధన అవసరాల్లో 80 శాతం దిగుమతులపైనే ఆధారపడింది. అయితే, రష్యా నుంచి 2-3శాతం చమురును మాత్రమే కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే ముడిచమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. డిస్కౌంట్‌కు కొనుగోలు చేస్తే ఖజానాపై భారం తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది.
ఆర్థిక ప్రయోజనం కోసం...
ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో 50 బిలియన్ డాలర్లకు పైగా ఈ దిగుమతులపైనే వెచ్చించాల్సి ఉంటుందని కేంద్రం లెక్కలు వేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే చౌకగా లభించే ముడి సరకులకు ప్రాధాన్యం ఇస్తోంది. రష్యాతో పాటు బెలారస్ నుంచి ఎరువులనూ దిగుమతి చేసుకోవాలని యోచిస్తోంది. రైతులకు ఎరువులపై రాయితీ ఇస్తున్న నేపథ్యంలో.. ఖజానాపై రూ.20 వేల నుంచి రూ.30 వేల కోట్ల వరకు అదనంగా భారం పడనుంది. 'అందువల్ల రష్యా నుంచి కూడా తక్కువ ధరకు ఫర్టిలైజర్లను దిగుమతి చేసుకోవాలని అనుకుంటున్నాం. దీని వల్ల ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుంది' అని అధికారులు చెప్పారు.