డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 9 నెలల కనిష్ఠ స్థాయి అయిన 75.05కు చేరింది. గతేడాది ఇదే సమయంలో పోలిస్తే 2 శాతం పైగా క్షీణించింది. ఈ బలహీనతలు ఆర్థిక వ్యవస్థకు, స్టాక్ మార్కెట్లకు ఇబ్బంది తెచ్చిపెడుతున్నాయి. ఇంతకీ రూపాయికి ఎందుకంత కష్టమొచ్చిందీ అంటే.. అదనపు ద్రవ్యలభ్యతే ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
క్షీణతకు కారణాలు..
రూపాయి మారకపు విలువ క్షీణత అనేది పలు అంశాల ఆధారంగా జరుగుతుంది. అదెలాగంటే.. ప్రభుత్వం భారీ రుణాలు తీసుకోడానికి వీలుగా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) రూ.లక్ష కోట్ల విలువైన బాండ్లను మార్కెట్ల నుంచి కొనుగోలు చేయనుంది. తొలి దశ కింద రూ.25,000 కోట్ల కొనుగోళ్లు గురువారం (ఏప్రిల్ 15) ప్రారంభించనుంది. ఇప్పటికే వ్యవస్థలో రూ.7 లక్షల కోట్ల వరకు ద్రవ్యలభ్యత ఉంది. ఇప్పుడీ బాండ్ల కొనుగోళ్ల వల్ల మరింతగా సమకూరనుంది. ఈ అదనపు ద్రవ్యలభ్యత కాస్తా రూపాయి విలువ మీద ఒత్తిడి పెంచుతుంది. స్థానిక కరెన్సీ సరఫరా పెరిగితే, డాలరుతో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతుంది.
వడ్డీ రేట్ల ప్రభావమూ
వ్యవస్థలోకి మరింత నగదు చొప్పించడం వల్ల దీర్ఘకాలం పాటు వడ్డీ రేట్లు తక్కువగానే ఉంటాయన్న సంకేతాలను ఆర్‌బీఐ ఇస్తోంది. అంటే ద్రవ్యోల్బణం పెరిగినా.. వడ్డీ రేట్లు పెరగవు అన్నమాట. మొత్తం మీద తక్కువ వడ్డీ రేట్లే అమలవుతాయి. ఇది కాస్తా..పెద్ద పెట్టుబడుదార్లు తమ మూలధనాలను భారత్ నుంచి బయటకు తరలించడానికి కారణమవుతాయి. అంటే భారత్ అనేది ఆకర్షణీయ మార్కెట్‌గా ఉండదన్నమాట. అలా మూలధనం బయటకు వెళితే రూపాయిపైనే కదా భారం పడేది.
ఇప్పటికే మొదలైంది..
ఈ నెలలో ఇప్పటికే విదేశీ పెట్టుబడుదార్లు మన దేశం నుంచి నికర అమ్మకాలు చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతూ, దిగుమతులు పెరిగే కొద్దీ వాణిజ్య లోటు పెరుగుతూ ఉంటుంది. అంతర్జాతీయంగా ముడి పదార్థాల ధరలు పెరుగుతుంటే, వాణిజ్య లోటు ఇంకా అధికమవుతుంది. ఇది అదుపులో ఉండాలంటే, ఎగుమతులు కూడా ఆ స్థాయిలో పెరగాలి. కొవిడ్ రెండోదశ వల్ల మళ్లీ పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించే పరిస్థితుల్లో, ఎగుమతులు ఎలా ఉంటాయనేది చెప్పలేని స్థితి. దేశ ఆర్థిక రాజధాని ముంబయి ఉన్న మహారాష్ట్రలో కేసులు రికార్డు స్థాయికి చేరాయి. లాక్‌డౌన్ తరహా ఆంక్షలు విధిస్తామని ఆ రాష్ట్రప్రభుత్వం ప్రకటిస్తోంది. ఇందువల్ల ఆర్థిక వ్యవస్థలో అన్ని విభాగాలపైనా, వ్యాపారాలపైనా ప్రభావం పడుతుంది. ఈ అంశాలన్నీ రూపాయి క్షీణతకే దారితీసే వీలుంది. వృద్ధిపైనే దృష్టి సారించిన ఆర్‌బీఐ రూపాయి విషయంలో జోక్యం చేసుకునేలా కనిపించడం లేదు.
76కు రూపాయి మారకపు విలువ?: కొంత మంది విశ్లేషకుల అంచనాల ప్రకారం.. రూపాయి 76 స్థాయి వరకు బలహీనపడవచ్చు. ఆర్‌బీఐ చేపడుతున్న ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్ల(జి-సాప్) ప్రణాళిక మార్కెట్లపై ఎలా ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. ఈ పథకం ప్రారంభమయ్యాకే కొంత స్పష్టత వస్తుంది.
క్షీణిస్తే.. వీటిపై ప్రభావం
రూపాయి బలహీనపడితే.. మనం దిగుమతి చేసుకునే వస్తువులు ప్రియం అవుతాయి. ముఖ్యంగా ముడి చమురు అవసరాల్లో 80 శాతం దిగుమతిపైనే ఆధారపడి ఉన్నాం. ముడి చమురు బిల్లు అధికమైతే, మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే భారం పడుతుంది. ఎక్కువ వ్యయాల కారణంగా ద్రవ్యలోటు పెరుగుతుంది. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ రేట్లూ పెరిగి సామాన్యుడి జేబుపై ప్రభావం పడుతుంది. రవాణా ఛార్జీలు పెరిగి, కూరగాయలు సహా అన్ని వస్తువుల ధరలూ పెరుగుతాయి. దీని వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడడం వల్ల అటు ఆర్థిక వ్యవస్థకు.. ఇటు సామాన్యుడికీ కష్టాలు ఏర్పడతాయి.
ఇదీ చదవండి:కరోనా ఆంక్షలతో రూ.79 వేల కోట్ల నష్టం!