రూ.2వేల నోట్ల ముద్రణపై కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తెరదించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచే రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేసినట్లు స్పష్టం చేసింది.
తగ్గిన నోట్ల సంఖ్య
2018 మార్చి చివరి నాటికి చలామణిలో ఉన్న రూ.2వేల నోట్ల సంఖ్య 33,632 లక్షలుగా ఉన్నట్లు తెలిపింది ఆర్బీఐ. ఈ సంఖ్య 2019 మార్చి ఆఖరు నాటికి.. 32,910లక్షలకు.. 2020 మార్చి చివరి నాటికి 27,398లక్షలకు తగ్గినట్లు ఆర్బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది.
చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో రూ.2వేల నోట్ల సంఖ్య 2018 మార్చి నాటికి 3.3 శాతం ఉన్నట్లు తెలిపింది ఆర్బీఐ. ఈ విలువ 2019 మార్చి నాటికి 3 శాతానికి, 2020 మార్చి చివరి నాటికి 2.4 శాతానికి తగ్గినట్లు పేర్కొంది.
మొత్తం కరెన్సీ విలువలో రూ.2వేల నోట్ల వాటా 2018 మార్చి చివరి నాటికి 37.3 శాతంగా ఉంది. ఇది 2019 మార్చి చివరి నాటికి 31.2 శాతానికి, 2020 మార్చి నాటికి 22.6 శాతానికి తగ్గింది అని ఆర్బీఐ వివరించింది.