తెలంగాణ

telangana

ETV Bharat / business

పద్దు: ప్రకటనలు ఎన్నెన్నో.. అమలైనవి కొన్నే

ప్రతి ఏటా పద్దు ప్రవేశపెట్టే సమయంలో ఎన్నో ప్రకటనలు చేస్తుంటాయి ప్రభుత్వాలు. అలా నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా తొలి సారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు.. పలు కీలక ప్రకటనలు చేశారు. మరి వాటిలో ఎన్ని ఆచరణకు నోచుకున్నాయి. మరెన్ని ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి అనేది తెలుసుకుందాం.

nirmala
నిర్మలా సీతారామన్​

By

Published : Jan 19, 2020, 6:45 PM IST

Updated : Jan 19, 2020, 11:45 PM IST

ప్రభుత్వాలు బడ్జెట్లలో ఎన్నో ప్రకటనలు చేస్తుంటాయి. కానీ, వాస్తవంగా వీటిల్లో కొన్నే అమలవుతాయి. ప్రతి ప్రభుత్వంలో ఇవి సర్వసాధారణం. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ పలు కీలక ప్రకటనలు చేశారు. వీటిల్లో కొన్ని అమలుకు నోచుకోగా.. మరికొన్ని అసలే అమలు కాలేదు. ఇంకొన్ని లక్ష్యానికి ఆమడ దూరంలో నిలిచిపోయాయి. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం.. పన్ను వసూళ్లు తగ్గడం వంటి అనుకోని అవాంతరాలు ఎదురుకావడం కారణంగా ప్రభుత్వం వీటి అమల్లో దూకుడుగా ముందుకు పోలేకపోయింది.

  • ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్‌ యోజన రెండోదశ కింద 2019-20 నుంచి 2021-22 నాటికి 1.95కోట్ల ఇళ్లను అర్హుల కోసం నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.

ప్రస్తుతం:ఈ పథకాన్ని 2015లో ప్రకటించిన నాటి నుంచి 2019-20 వరకు దాదాపు 91లక్షల ఇళ్లను నిర్మించారు. ఈ సమయంలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకొన్న 1.5కోట్ల ఇళ్ల లక్ష్యాన్నే ఇది చేరుకోలేదు. 2019-20లో కేవలం 4.5లక్షల ఇళ్లను మాత్రమే నిర్మించినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే పథకం మొదటి దశ కంటే దాదాపు మూడు రెట్ల వేగంతో ఇళ్లను నిర్మిస్తేనే లక్ష్యాన్ని చేరుకొనే పరిస్థితి నెలకొంది.

  • జలశక్తి మంత్రిత్వశాఖ రాష్ట్రాలతో కలిసి పనిచేసి 2024నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని వారికి కుళాయి నీటిని అందించాలి.

ప్రస్తుతం: స్వతంత్రం వచ్చిన నాటి నుంచి 3.28కోట్ల మంది గ్రామీణులకే కుళాయి నీళ్లు అందుతున్నాయి. అంటే మొత్తంలో ఇది కేవలం 18శాతం మాత్రమే అన్నమాట. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖను ప్రారంభించి లక్ష్యాన్ని నిర్దేశించినా.. ఈశాఖకు సంబంధించిన విధివిధానాలను రచించేటప్పటికి 2019 డిసెంబర్‌ వరకు సమయం పట్టింది. 2024 నాటికి ఈ లక్ష్యాన్ని చేరాలంటే రోజుకు కొత్తగా లక్ష గ్రామీణ గృహాలకు పైపులైన్‌ నీటిని అందించాల్సి ఉంటుంది.

  • దేశంలో పరిశోధనలకు నిధులను సమకూర్చడానికి, సమన్వయం కోసం, ప్రోత్సహించడానికి నేషనల్‌ రీసెర్చి ఫౌండేషన్‌ ఏర్పాటు చేయడం.

ప్రస్తుతం: ఇప్పటి వరకు ఇటువంటి సంస్థను మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రారంభించలేదు. దీనికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టు అక్టోబర్‌లోనే పూర్తయింది. ప్రస్తుతం ఇది వివిధ శాఖల ఆమోదానికి ఎదురు చూస్తోంది.

  • 2019-20 నాటికి ప్రభుత్వ రంగ సంస్థల్లో 1,05,000 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించాలని నిర్ణయించింది.

ప్రస్తుతం:ఇప్పటి వరకు ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం రూ.17,364 కోట్ల పెట్టుబడులను మాత్రమే ఉపసంహరించుకొంది. అత్యంత కీలకమైన ఎయిర్‌ ఇండియా విక్రయం నెమ్మదిగా కదులుతోంది.

  • విదేశీ మార్కెట్ల నుంచి విదేశీ కరెన్సీ రూపంలో రుణాలను సేకరించడం.

ప్రస్తుతం:ఈ ప్రకటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. విదేశీ కరెన్సీలో ఎంత రుణం తెచ్చారో ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది.

  • పాన్‌ కార్డు లేనివారు ఆధార్‌ నెంబర్‌తో ఐటీ రిటర్నులు ఫైల్‌ చేసేలా ఏర్పాటు చేయడం. దీంతోపాటు పాన్‌ నెంబర్‌ అవసరమైన చోట ఆధార్‌ సంఖ్యను వాడుకోవచ్చు.

ప్రస్తుతం:ఇప్పటికే పాన్‌కార్డును ఆధార్‌ సంఖ్యతో అనుసంధానించేందుకు తుదిగడువును 2020 మార్చి వరకు పొడిగింది. అప్పటిలోగా ఆధార్‌ సంఖ్యను అనుసంధానించకపోతే పాన్‌కార్డు నిరుపయోగంగా మారుతుందని అధికారులు ప్రకటించారు.

  • రూ.50 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్‌ ఉన్న సంస్థల్లో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఎండీఆర్‌ ఛార్జీలను తొలగించడం. దీనికి సంబంధించిన ఆదాయపన్ను చట్టం, పేమెంట్స్‌ అండ్‌ సెటిల్మెంట్స్‌ చట్టం 2007లో అవసరమైన సవరణలు చేయడం.

ప్రస్తుతం: తాజాగా రూ.50 కోట్లకు పైగా టర్నోవర్‌ ఉన్న సంస్థల్లో డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థలను ప్రవేశపెట్టకపోతే రోజుకు రూ.5,000 చొప్పున జరిమానా విధిస్తామని వెల్లడించింది.

  • ఎలక్ట్రానిక్‌ ఇన్వాయిస్‌ విధానంలోకి మారతాము. దీనిని జారీ చేసినప్పటి నుంచి ఇన్వాయిస్‌ డిటైల్స్‌ సెంట్రల్‌ సిస్టమ్‌లో నిక్షిప్తమవుతాయి.

ప్రస్తుతం: ప్రస్తుతం బిజినెస్‌ టు బిజినెస్‌ విధానంలో స్వచ్ఛందగా వీటిని అమలు చేసి పరిణమాలను పరిశీలించేందుకు జీఎస్‌టీ కౌన్సిల్‌ ఇప్పటికే ఆమోదం తెలిపింది.

  • ఈక్విటీ అనుసంధానిత పొదుపు పథకం ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ప్రస్తుతం: ఇప్పటికే ప్రభుత్వం భారత్‌ బాండ్స్‌ ఈటీఎఫ్ పేరుతో వీటిని తీసుకొచ్చింది. భారత్‌లో ఇదే తొలి కార్పొరేట్‌ బాండ్‌. దీనిలో కనీసం రూ.1000 నుంచి పెట్టుబడి మొదలవుతుంది.

  • స్టార్టప్‌ల కోసం డీడీ ఛానెల్స్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తాము

ప్రస్తుతం: ఈ ప్రకటన చేసిన కొన్నాళ్లకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి స్టార్టప్‌ కీ బాత్‌ అని పేరుపెట్టారు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు దీనిని నిర్వహిస్తారు.

  • క్రెడిట్‌ గ్యారెంటీ ఎన్‌హాన్స్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు

ప్రస్తుతం: ఇప్పటి వరకు అటువంటి సంస్థ ఏర్పాటుకు సంబంధించిన ఎటువంటి విధానపరమైన చర్యలు తీసుకోలేదు.

ఇదీ చూడండి:'వీఆర్​ఎస్​'కు ఎయిర్​ఇండియా యూనియన్ల డిమాండ్!

Last Updated : Jan 19, 2020, 11:45 PM IST

ABOUT THE AUTHOR

...view details