RBI Monetary Policy: కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ వరుసగా పదోసారి యథాతథంగా ఉంచింది. 3 రోజుల సమీక్ష అనంతరం.. ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) నిర్ణయాలను నేడు ప్రకటించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో.. యథాతథ స్థితిని కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇందుకు కమిటీ సభ్యులు అంతా అంగీకరించారని వెల్లడించారు.
- రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు కూడా 3.35 శాతం వద్ద యథాతథంగా ఉండనున్నట్లు పేర్కొన్నారు.
- 2020 మే 22న శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ఎంపీసీ ఆఖరిసారిగా వడ్డీరేట్లలో మార్పులు చేసింది.
- 2022-23 బడ్జెట్ తర్వాత.. తొలి ఎంపీసీ సమావేశం ఇదే.
వృద్ధి రేటుపై..
- 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటును 7.8 శాతంగా ఉంటుందని అంచనా వేసింది ఆర్బీఐ.
- ద్రవ్యోల్బణం 2021-22 ఏడాదికి 5.3 శాతం, 2022-23 ఏడాదికి 4.5 శాతంగా ఉంటుందని అంచనా.