వ్యక్తిగత, గృహ, ఆటో, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చే రుణాల వడ్డీ రేట్లను బాహ్య ప్రమాణాలైన రెపో రేటు, ట్రెజరీ రాబడుల ఆధారంగా నిర్ణయించే పద్ధతి అమలు మరింత ఆలస్య కానుంది. ఈ కొత్త విధానానికి సంబంధించి బ్యాంకులతో మరిన్ని చర్చలు జరపనున్నట్లు ద్రవ్య పరపతి విధాన సమీక్ష ప్రకటనలో భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) వెల్లడించింది.
ఈ కొత్త పద్ధతి వల్ల వ్యక్తిగత, చిన్న తరహా పరిశ్రమల రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించటంలో మరింత పారదర్శకత రానుంది. ఆదాయపు పన్ను వ్యవస్థను ఆధునికీకరించడం, వడ్డీ రేట్ల నష్ట భయాల నిర్వహణ అంశాలపై రిజర్వు బ్యాంకు చర్చించనుంది. అయితే కొత్త పద్ధతి అమలు చేసే తేదీపై స్పష్టత నివ్వలేదు ఆర్బీఐ.
దేశ బ్యాంకింగ్ రంగంలో నాలుగో వంతు వాటా ఉన్న ప్రభుత్వ రంగ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బీఐ).... పొదుపు ఖాతా, స్వల్ప కాల రుణాల వడ్డీ రేట్లను రెపో రేటుతో మే 1 నుంచి అనుసంధానం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.