కరోనాతో అన్ని రంగాల్లానే రైల్వే సైతం గడ్డుకాలాన్ని ఎదుర్కొంది. లాక్‌డౌన్ కారణంగా నెలల పాటు రైళ్లు పూర్తిగా స్టేషన్లకే పరిమితమయ్యాయి. ఇప్పటికీ రైలు సర్వీసులు పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైల్వేకు భారీ కేటాయింపులు చేశారు. రైల్వే రంగానికి మొత్తం రూ.1.10 లక్షల కోట్లు కేటాయించారు. దీంట్లో రూ. 1.07 లక్షల కోట్లను మూలధన వ్యయం కోసం కేటాయించనున్నట్లు ప్రకటించారు. అలాగే భారత నూతన జాతీయ రైల్వే ప్రణాళికను ఆవిష్కరించారు.
ఆంధ్రాకు రెండు కారిడార్లు...
నూతన రైల్వే ప్రణాళికలో భాగంగా సరకు రవాణా ఖర్చులను తగ్గించి మేకిన్ ఇండియా కార్యక్రమానికి ఊతమిచ్చేందుకు చర్యలు చేపడతామని సీతారామన్ ప్రకటించారు. అందుకోసం ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట్-కోస్ట్ కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ నుంచి విజయవాడ వరకు ఉత్తర-దక్షిణ కారిడార్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను తొలి దశలో రూపొందిస్తామని వివరించారు. రైల్వేలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు దక్కిన ప్రధాన కేటాయింపులు ఇంతవరకే పరిమితం కావడం గమనార్హం. ఇక తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా నడవాలను 2022, జూన్ నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. వీటిలో కొన్ని కారిడార్‌లను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)తో చేపడతామని వెల్లడించారు. సోనేనగర్-గోమో మధ్య 263 కి.మీ కారిడార్‌ను, గోమో-డంకునీ మధ్య 274.3 కి.మీ కారిడార్‌ను కొత్తగా ప్రతిపాదించారు.