తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్‌కు సహకరించేందుకు సిద్ధం: ఐఎంఎఫ్​ - ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావంపై ఐఎంఎఫ్​

కొవిడ్​ రెండో దశతో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న భారత్​కు అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్​) వెల్లడించింది. మహమ్మారి సమయంలో భారత్‌కు అండగా నిలిచేందుకు పలు దేశాలు ముందుకు రావడం మంచి పరిణామంగా పేర్కొంది ఐఎంఎఫ్​.

IMF on India Fight on Corona
కరోనా సంక్షోభంపై ఐఎంఎప్​ స్పందన

By

Published : May 21, 2021, 1:35 PM IST

కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత్‌కు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) వెల్లడించింది. కొవిడ్​ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందని సంస్థ ప్రతినిధి జెర్రీ రైస్‌ అన్నారు. భారత్‌లో కరోనాతో పోరాడుతున్న వారికి, ప్రాణాలు కోల్పోయిన వారికి ఐఎంఎఫ్‌ అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

"భారత్‌లో కరోనా మహమ్మారి ప్రభావాన్ని ఐఎంఎఫ్‌ గమనిస్తోంది. అక్కడ వ్యాక్సినేషన్​ను వేగవంతం చేయడం సహా ఆరోగ్య రంగానికి ఆర్థిక వనరులు అందించడం చాలా ముఖ్యం. కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన పూర్తి సాంకేతిక సహకారాన్ని ఆ దేశానికి అందిస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ కొవిడ్‌ సహాయక కార్యక్రమాలు రెట్టింపు చేస్తాం"

-జెర్రీ రైస్‌, ఐఎంఎఫ్​ ప్రతినిధి

మహమ్మారి సమయంలో భారత్‌కు అండగా నిలిచేందుకు పలు దేశాలు ముందుకు రావడాన్ని మంచి పరిణామంగా జెర్రీ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం చూపించిందని పేర్కొన్నారు. జులైలో వరల్డ్‌ ఎకనామిక్‌ ఔట్‌లుక్‌ అప్డేట్‌ను ఐఎంఎప్‌ విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

కరోనాను ఎదుర్కొనేందుకు భారత్ తీసుకున్న చర్యలను గతంలో ఐఎంఎఫ్‌ ప్రశంసించింది. భారత్‌కు పూర్తి సహకారాన్ని అందిస్తామని ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టాలినా జార్జీవా తెలిపారు.

ఇదీ చదవండి:చైనాలో టెస్లా విద్యుత్​ కార్ల పార్కింగ్​పై నిషేధం!

ABOUT THE AUTHOR

...view details