కేంద్రానికి రూ.99,122 కోట్ల మిగులు నిధులను బదిలీ చేయాలని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది.
రిస్క్ బఫర్‌ను 5.50 శాతం వద్ద కొనసాగిస్తూ ఈ నిధులను బదిలీ చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. 2021 మార్చి 31తో ముగిసిన 9 నెలల అకౌంటింగ్ కాలానికి గానూ.. మిగులు నిధులుగా ఈ మొత్తాన్ని బదిలీ చేయనున్నట్లు తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
సంవత్సరాల వారీగా..
2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.57,128 కోట్లు కేంద్రానికి బదిలీ చేసింది ఆర్బీఐ.
2018-19లో ఏకంగా 1,76,051 కోట్ల నిధులను కేంద్రానికి ఇచ్చింది. ఇందులో రూ.1,23,414 కోట్లు మిగులు నిధులు. మిగతా రూ.52,637 కోట్లను డివిడెండ్‌గా ఇచ్చింది. మోదీ ప్రభుత్వ ఏర్పడిన తర్వాత ఆర్బీఐ ఇచ్చిన అధిక మొత్తం ఇదే అత్యధికం.
2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను.. 50,000 కోట్లను కేంద్రానికి బదిలీ చేసింది ఆర్బీఐ.
గతంలో ఆర్బీఐ మిగులు నిధుల బదిలీ వివరాలు.. మిగులు నిధులు కేంద్రానికే ఎందుకు?
ఆర్బీఐను.. 1935, ఏప్రిల్ 1న బ్రిటీష్ పాలనలో స్థాపించారు. భారతీయ రిజర్వు బ్యాంక్ యాక్ట్ 1934ను అనుసరించి దీనిని ఏర్పాటు చేశారు. తొలుత ఇది పూర్తిగా ప్రైవేటు బ్యాంక్‌గా సేవలందించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1949లో ఆర్బీఐని భారత ప్రభుత్వం జాతీయం చేసింది. అప్పటి నుంచి ఆర్బీఐపై పూర్తి హక్కులు ప్రభుత్వానికి బదిలీ అయ్యాయి. అయితే ఆర్బీఐ చట్టం 1935 ప్రకారం ఆర్బీఐ వద్దనున్న మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేయడం తప్పనిసరి అనే నిబంధన కొనసాగుతూ వస్తోంది.
ఇదీ చదవండి:భారత్‌కు సహకరించేందుకు సిద్ధం: ఐఎంఎఫ్