కరెన్సీ నోట్లను గుర్తించేందుకు సరికొత్త మొబైల్ యాప్‌ను రూపొందించాలని ప్రతిపాదనలు తీసుకువచ్చింది భారతీయ రిజర్వు బ్యాంకు. అంధులు సులభంగా నోట్లను గుర్తించేందుకు ఈ యాప్‌ను తీసుకురానున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.
దేశంలో ప్రస్తుతం రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 నోట్లు వాడుకలో ఉన్నాయి. వీటితో పాటు రూ.1 నోటునూ భారత ప్రభుత్వం జారీ చేస్తోంది.
ఇంటాగ్లియోతో ముద్రిస్తున్న గుర్తింపు చిహ్నాలతో అంధులు ప్రస్తుతం నోట్లను గుర్తిస్తున్నారు. అయితే ఈ చిహ్నాలు రూ.100కు పైబడిన నోట్లపైనే ఉన్నాయి. అన్ని నోట్లను ఫోన్ ద్వారా గుర్తించే ఏర్పాటు చేసే యాప్‌ను రూపొందించాలని కేంద్ర బ్యాంకు నూతన ప్రతిపాదనలు చేసింది.
- యాప్ ద్వారా మహాత్మా గాంధీ కొత్త, పాత శ్రేణి నోట్లను మొబైల్ కెమెరా ముందు ఉంచి స్కాన్ చేస్తే వాటి విలువను చెప్పాలి.
- నోట్ల గుర్తింపునకు 2 సెకన్లు లేదా అంతకన్నా తక్కువ సమయం పట్టాలి.
- అన్ని యాప్ స్టోర్లలో వాయిస్ సెర్చ్‌కు అనుకూలంగా ఈ యాప్ ఉండాలి.
- మొదట కనీసం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నోటిఫికేషన్లకు యాప్ సపోర్ట్ చేయాలి. ఆ తర్వాత ఇతర భాషలకు విస్తరించాలి.