తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రైవేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటా పెంపు! - ఎన్​బీఎఫ్​సీలపై ఇంటర్నల్ వర్కింగ్​ గ్రూప్ సిఫార్సులు

బ్యాంకింగ్ వ్యవస్థ అంతర్గత వ్యవహారాల సమీక్షకు ఏర్పాటు చేసిన ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ నివేదికను విడుదల చేసింది ఆర్​బీఐ. ఇందులో.. 15 ఏళ్లలో ప్రైవేటు బ్యాంకుల్లో ప్రస్తుతమున్న ప్రమోటర్ల వాటా పరిమితిని 15 శాతం నుంచి 26 శాతానికి పెంచాలని సిఫార్సు చేసింది గ్రూప్.

RBI IWG recommendations On New Banks
ప్రమోటర్ల వాటా పెంపునకు ఆర్​బీఐ ప్యానెల్ సిఫార్సు

By

Published : Nov 20, 2020, 5:41 PM IST

భారతీయ రిజర్వు బ్యాంక్​ (ఆర్​బీఐ) ఏర్పాటు చేసిన ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యూజీ).. ప్రైవేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాపై ప్రస్తుతమున్న 15 శాతం పరిమితిని 26 శాతానికి పెంచాలని సూచించింది. 15 ఏళ్లలో ఈ పెంపు ఉండాలని సిఫార్సు చేసింది.

బ్యాంకింగ్ నిబంధనల్లో సవరణలు, పర్యవేక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసిన తర్వాతే.. కార్పొరేట్, పారిశ్రామిక దిగ్గజాలను బ్యాంకుల ప్రమోటర్​గా వ్యవహరించేందుకు అనుమతివ్వాలని ఆర్​బీఐకి సూచించింది ఐడబ్ల్యూజీ.

ప్రైవేటు బ్యాంకుల కార్పొరేట్, యాజమాన్య మార్గదర్శకాలను సమీక్షించేందుకు ఈ ఏడాది జనవరి 12 ఐడబ్ల్యూజీని ఏర్పాటు చేసింది ఆర్​బీఐ. ఇటీవలే ప్యానెల్ తుది నివేదికను సమర్పించగా.. ఆ వివరాలను ఆర్​బీఐ శుక్రవారం విడుదల చేసింది.

రూ.50 వేల కోట్లు అంతకన్నా ఎక్కువ అసెట్ పరిమాణంతో.. సమర్థంగా పని చేస్తున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను (ఎన్​బీఎఫ్​సీ).. బ్యాంకులుగా మార్చే అంశాన్ని పరిగణించాలని కూడా ప్యానెల్ సూచించింది. అయితే పదేళ్లు పూర్తి చేసుకోవాలన్న నిబంధన పూర్తయిన వాటిని మాత్రమే పరిగణించాలని పేర్కొంది.

కొత్త బ్యాంకుల ఏర్పాటుకు కావాల్సిన మూలధనాన్ని.. యూనివర్సల్ బ్యాంకులకు రూ.500 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు, స్మాల్ ఫినాన్స్ బ్యాంకులకు రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పెంచాలని ప్యానెల్ సిఫార్సు చేసింది.

ఇదీ చూడండి:2 నెలల తర్వాత పెరిగిన పెట్రో ధరలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details