కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ మరోసారి యథాతథంగా ఉంచే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ, ఆర్థిక శాఖ లక్ష్యంగా పెట్టుకున్న స్థాయికన్నా.. వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న కారణంగా డిసెంబర్లో జరగనున్న ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షలో ఈ నిర్ణయం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. విశ్లేషకుల అంచనా ప్రకారం.. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకుంటే.. ఇవి యథాతథంగా ఉండటం వరసగా మూడోసారి అవుతుంది.
అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనూ భారత వృద్ధి రేటు ప్రతికూలంగానే నమోదైంది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల కోతకు అవకాశాలు లేకపోలేదని అంటున్నారు నిపుణులు.
ఆరుగురు సభ్యులతో కూడిన ద్రవ్య విధాన కమిటీ.. ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలో డిసెంబర్ 2 నుంచి సమీక్ష నిర్వహించనుంది. మూడు రోజుల సమావేశం అనంతరం డిసెంబర్ 4న రెపో రేటు సహా.. ఇతర కీలక నిర్ణయాలను ప్రకటించనుంది ఆర్బీఐ.
గత సమీక్ష నిర్ణయాలు ఇలా..
ద్రవ్యోల్బణం 6 శాతానికిపైగా నమోదైన కారణంగా.. రెపో రేటు, రివర్స్ రెపో రేట్లను వరుసగా 4 శాతం, 3.35 శాతం వద్ద యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ -9.5 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది.