ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్యవిధాన పరపతి సమావేశంలో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిది.
దీంతో రిజర్వు బ్యాంకు నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వడ్డీ 6 శాతానికి తగ్గింది. ఈ నిర్ణయంతో రివర్స్ రెపో రేటు 5.75 శాతానికి చేరింది.
చివరగా ఫిబ్రవరిలో జరిగిన సమీక్షలో రెపోను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది రిజర్వు బ్యాంకు. గతేడాది ఏప్రిల్లో కూడా రెపో రేటు 6 శాతంగా నమోదవటం గమనార్హం.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరిగిన ద్రవ్య పరపతి సమీక్షలో... మొత్తం ఆరుగురు సభ్యుల్లో నలుగురు ఈ రేట్లకోతకు ఆమోదం తెలిపారు.
గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలు 2.4 శాతానికి తగ్గించింది ఆర్బీఐ.
2019-20లో జీడీపీ, ద్రవ్యోల్బణం అంచనాలు
ఇందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు అంచనాలను 7.4 నుంచి 7.2 శాతానికి తగ్గించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగానికి రిటైల్ ద్రవ్యోల్బణంపై అంచనాలను 3-2.9 శాతానికి తగ్గించింది ఆర్బీఐ. సాధారణ వర్షపాతం సహా కూరగాయల ధరలు, చమురు ధరలు సానుకూలంగా ఉంటాయనే అంచనాలు ఇందుకు ప్రధాన కారణం.
అయితే ఇటీవల ఈ ఏడాది వాతావరణంపై ఎల్నినో ప్రభావం ఉంటుందని పరిశోధనలు స్పష్టంచేశాయి. ఇదే నిజమైతే ఆహార ఉత్పత్తుల ధరలు, చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బ్యారెల్ ముడి చమురు ధర రూ. 70 చేరువలో ఉండటం గమనార్హం.