ఆర్థిక వ్యవస్థపై కరోనా నీడలు కమ్ముకుంటున్న వేళ భారతీయ రిజర్వు బ్యాంకు పలు ఉద్దీపన చర్యలతో ముందుకొచ్చింది. రివర్స్ రెపో రేటు తగ్గింపు సహా చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద సాయాన్ని అందించాలని నిర్ణయించింది.
"కరోనా కారణంగా ప్రపంచం అత్యంత దయనీయ స్థితిని ఎదుర్కొంటుంది. ఇలాంటి తరుణంలో ఆర్బీఐ అప్రమత్తంగా ఉంది. పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. సమయానికి అనుగుణంగా మరిన్ని ఉద్దీపనలతో ముందుకొస్తాం"
- శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్
బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యకలాపాలు సాధారణ స్థితికి తెచ్చేందుకు ఆర్బీఐ పలు కీలక ఉద్దీపన చర్యలు ప్రకటించింది. దేశవ్యాప్త లాక్డౌన్ విధించాక ఆర్బీఐ గవర్నర్ మీడియా సమావేశం నిర్వహించడం ఇది రెండోసారి.
కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు రూ.50 వేల కోట్లతో ఎల్టీఆర్ఓ 2.0 ప్రకటించింది ఆర్బీఐ. ఫలితంగా ఆర్థిక వ్యవస్థలోకి రూ.50 వేల కోట్లు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ హౌసింగ్ బోర్డు, నాబార్డు, సిడ్బీకి ఈ నిధులు అందనున్నాయి.
ఆర్బీఐ కీలక ప్రకటనలు...
- రెపో రేటు యథాతథం.
- రివర్స్ రెపోరేటు 4 శాతం నుంచి 3.75 శాతానికి (25 బేసిస్ పాయింట్లు) తగ్గింపు.
- మారటోరియం సమయంలో 90 రోజుల ఎన్పీఏ గడువు వర్తించదు.
- రాష్ట్రాలకు 60 శాతం మేర డబ్ల్యూఎంఏ పెంపు.
- సెప్టెంబరు 30 వరకు డబ్ల్యూఎంఏ పెంపు అమలు.
- ఖరీఫ్‌లో 36 శాతం ధాన్యం ఉత్పత్తి పెరిగింది.
- భారత్ జీడీపీ 1.9 శాతంగా ఐఎంఎఫ్ అంచనా వేసింది. జీ-20 దేశాల్లో భారత్ జీడీపీనే అధికం.
- జీడీపీలో 3.2శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చాం.
- బ్యాంకుల కార్యకలాపాలు సాఫీగా సాగుతున్నాయి.
- లాక్డౌన్ వల్ల ప్రపంచ జీడీపీకి 9 ట్రిలియన్ డాలర్ల నష్టం.
- 2021-22 ఏడాదికి వృద్ధిరేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం.
- ప్రపంచవ్యాప్తంగా దేశాల వృద్ధిరేట్లు తిరోగమనంలో ఉన్నాయి.
- లాక్డౌన్ తర్వాత రూ.1.20 లక్షల కోట్లు విడుదల చేశాం.
- దేశ వ్యాప్తంగా 91 శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయి.
- బ్యాంకులు, ఏటీఎంలలో ఎప్పటికప్పుడు నగదు నింపుతున్నాం. బ్యాంకుల్లో సరిపడా దవ్ర లభ్యత ఉంది.
ఇదీ చూడండి:కరోనా దెబ్బకు చైనా రివర్స్ గేర్- జీడీపీ 6.8% క్షీణత