దేశంలో కొవిడ్ సంక్షోభం తీవ్రమవుతన్న నేపథ్యంలో ఆర్బీఐ రంగంలోకి దిగింది. ఎంపిక చేసిన వ్యక్తిగత, చిన్న తరహా పరిశ్రమ రుణాలపై మారటోరియం విధించింది. రెండేళ్ల వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. కరోనా సంక్షోభంలో నేపథ్యంలో వైద్య మౌలిక సదుపాయాలు, వ్యాక్సిన్ తయారీ దారులకు రుణాల విషయంలో ప్రధాన్యం ఇవ్వాలని బ్యాంకులకు సూచించింది.
కొవిడ్ సంబంధిత వైద్యవిభాగాలకు ప్రత్యేక నిధులను అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తి కాంతదాస్ వెల్లడించారు. ఇందుకోసం రూ.50 వేలకోట్ల మేరకు ఆన్‌ట్యాప్ నిధులను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించారు. వీటికి మూడేళ్ల కాల వ్యవధి ఉంటుందని పేర్కొన్నారు.
"భారత్ కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొంటుందన్న నమ్మకం ఉంది. ఈ సారి రుతుపవనాలు కూడా సానుకూలంగా ఉంటాయనే అంచనాలతో గ్రామాల్లో డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నాం. కొవిడ్ నిబంధనలు, ఆంక్షల్లో.. పలు సంస్థలు వ్యాపారాలను కాపాడుకునే శక్తిని తెచ్చుకున్నాయి. కొవిడ్ వైద్య సదుపాయాల పెంపునకు ఆర్‌బీఐ రూ.50వేల కోట్ల నిధులను బ్యాంకులకు అందుబాటులోకి తెచ్చింది"
-శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్
ఈ నిధులను బ్యాంకులు వ్యాక్సిన్ తయారీ సంస్థలకు, ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చేందుకు రుణాలుగా ఇవ్వొచ్చు. ఈ రుణాలకు ప్రాధాన్యం కూడా ఇవ్వనున్నారు. బ్యాంకులు ఈ పథకం కింద కొవిడ్ లోన్‌బుక్ ఏర్పాటు చేయవచ్చు.