కరోనా సృష్టించిన సంక్షోభం తర్వాత.. భారత ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో పుంజుకుంటున్నట్లు తాజా గణాంకాల్లో తేలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు -23.9 శాతంగా నమోదవ్వగా.. రెండో త్రైమాసికంలో -7.5 శాతానికి రికవరీ అయినట్లు తాజా అధికారిక గణాంకాల్లో వెల్లడైంది. ఈ లెక్కలు భారత ఆర్థిక వ్యవస్థ 'V' ఆకారపు రికవరీ సాధిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.
వృద్ధి రేటు వేగంగాపుంజుకుంటున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ (16.4 శాతం)తో పాటు బ్రిటన్ (15.5 శాతం), ఫ్రాన్స్ (14.6 శాతం), అమెరికా (7.4 శాతం) ఉన్నాయి.
భారత వృద్ధి రేటు ఆశించిన దానికంటే వేగంగా పుంజుకోవడం సానుకూలమైన అంశమని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ అంటున్నారు. ఇందుకు ప్రధాన కారణమైన తయారీ రంగ రికవరీ.. దేశవ్యాప్తంగా పెరిగిన డిమాండ్‌ను కూడా సూచిస్తున్నట్లు తెలిపారు.
రికవరీకి ప్రధాన కారణాలు..
కరోనా సంక్షోభంలోనూ వ్యవసాయ రంగం సానుకూలంగా స్పందిస్తోంది. రెండో త్రైమాసిక గణాంకాల ప్రకారం వ్యవసాయ అనుంబంధ రంగాలు 3.4 శాతం వృద్ధి రేటును నమోదు చేశాయి. మొదటి త్రైమాసికంలోనూ ఆయా రంగాలు ఇదే వృద్ధి రేటును నమోదు చేయడం గమనార్హం.
2020-21 క్యూ1లో 39.3 శాతం క్షీణించిన తయారీ రంగ వృద్ధి రేటు.. రికార్డు స్థాయిలో క్యూ2లో 0.6 శాతానికి రికవరీ సాధించింది.