తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థికం తెలియకున్నా.. అందులోనూ తనదైన ముద్ర

'ఒక వ్యక్తి పుట్టుకతో కాదు, చేతల వల్ల గొప్పవాడవుతాడు' అని కౌటిల్యుడు అన్న మాటలు పీవీ నరసింహారావుకు అతికినట్లు సరిపోతాయి. ఎందుకంటే ప్రధానిగా ఆయన చేసిన కృషి నిరుపమానం. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈనాడు భారత్‌ను ఆర్థికంగా నిలబడేలా చేశాయి.

PV NARASIMHA RAO ECONOMIC REFORMS HAS TURNED THE INDIA
ఆర్థికం తెలియకున్నా.. అందులోనూ తనదైన ముద్ర

By

Published : Jun 28, 2020, 7:46 AM IST

Updated : Jun 28, 2020, 9:33 AM IST

ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని మలుపుతిప్పిన పీవీ నరసింహారావుకు... ఆర్థికశాస్త్రంలో పెద్దగా అవగాహన లేదంటే నమ్మలేం కదూ! కానీ అది నిజం! రక్షణ, విదేశాంగ, మానవ వనరులు, హోంశాఖ... ఇలా అనేక కీలకశాఖలు చేపట్టిన అనుభవమున్న పీవీకి ఆర్థికం ఎన్నడూ ఎదురుకాలేదు. పైగా ప్రధాని పదవి చేపట్టేనాటి దాకా తనది నెహ్రూ తరహా సామ్యవాద ధోరణి! లైసెన్స్‌రాజ్‌, కోటారాజ్‌లను రక్షించాలనే ధోరణే! కానీ... ప్రధాని కాగానే దేశ ఆర్థికపరిస్థితిని ఆకళింపు చేసుకున్న ఆయన ఒక్కరోజులోనే తన విధానం పనికిరాదని గ్రహించారు... తనలాంటి సంప్రదాయ రాజకీయులతో దీన్ని బాగుచేయటం కుదరదనీ... ఆర్థిక వేత్తే విత్తమంత్రి కావాలని నిర్ణయించుకున్నారు. మన్మోహన్‌ను ఎంచుకున్నారు. ఆయనకు అండగా నిలిచారు.

1991 ఆర్థిక సంక్షోభం

1990 చివరి నాటికి మనదేశపు ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటింది. చమురు అత్యంత ఖరీదు అయింది. చమురు దిగుమతి చేసుకోవటానికి తగినంత విదేశీ మారక ద్రవ్యం లేదు. చేతిలో ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు మూడు వారాల దిగుమతులకే సరిపోతాయి. 1991 జనవరి నాటికి ప్రభుత్వమే దివాలా తీసే పరిస్థితి. ఈ నేపథ్యంలో రూపాయి మారకం విలువ ఒక్కసారిగా కుదేలైంది. దేశం లోపల కానీ, బయట కానీ... ఎక్కడా అప్పులు పుట్టలేదు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) కూడా మొహం చాటేశాయి. చివరికి బంగారాన్ని తనఖా పెట్టి (ఐఎంఎఫ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్విట్జర్లాండ్‌ దగ్గర...) కొంత సొమ్ము తెచ్చి, అప్పులు తీర్చాల్సిన దుస్థితి స్వతంత్ర భారత చరిత్రలో అదే అత్యంత విషాదకరమైన ఘట్టం.

సంస్కరణల సింహం వచ్చింది

అనూహ్యంగా 1991 జూన్‌ 21న పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దేశాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించటానికి క్షేత్ర స్థాయిలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చకచకా నిర్ణయాలు తీసుకున్నారు.

ఏం చేశారు?

చెల్లింపుల సంక్షోభం (బ్యాలెన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌) నుంచి గట్టెక్కటానికి తీసుకున్న మొదటి నిర్ణయం రూపాయి విలువను తగ్గించటం. రెండు విడతలుగా తగ్గించారు. దీంతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టటానికి, ఎగుమతులు పెరగటానికి వీలుకలిగింది.

  • ద్రవ్య లోటును తగ్గించటంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఎరువుల రాయితీని తగ్గించాలని, చక్కెర మీద రాయితీ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు ఉపసంహరించుకోవాలని ప్రతిపాదించారు. పన్ను సంస్కరణలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీంతో ఆదాయం పెరిగేందుకు, ఖర్చులు తగ్గేందుకు అవకాశం ఏర్పడింది.
  • వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకులకు స్వేచ్ఛనిచ్చారు. ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు వీలుకల్పించటం ద్వారా బ్యాంకింగ్‌ రంగంలో పోటీకి అవకాశం కల్పించారు.
  • స్టాక్‌మార్కెట్లకు సంబంధించి పెద్దఎత్తున మార్పులు తీసుకువచ్చారు. సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజి బోర్డు ఆఫ్‌ ఇండియా) కి 1992లో చట్టబద్ధత కల్పించారు. మూలధన సమీకరణకు వీలుగా తగిన చర్యలు తీసుకునే విధంగా సెబీని ప్రోత్సహించారు.
  • పారిశ్రామిక రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలు అత్యంత కీలకం. ఇందులో భాగంగా 1991 నూతన పారిశ్రామిక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. దీనివల్ల ‘లైసెన్స్‌ రాజ్‌’ బలహీన పడి స్వేచ్చగా పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం కలిగింది. ఈ విధానం వల్ల దాదాపు 80 శాతం పరిశ్రమలకు లైసెన్సులు తీసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ప్రభుత్వ రంగ సంస్థలకే రిజర్వు చేసిన ఎన్నో రంగాల్లో ప్రైవేటు రంగానికి ప్రవేశం కల్పించారు. రైల్వేలు, అణు ఇంధనం, రక్షణ వంటి 8 రంగాలను మినహాయిస్తే, మిగిలిన అన్ని రంగాల్లో ప్రైవేటు రంగ సంస్థలు అడుగుపెట్టే అవకాశం ఏర్పడింది.
  • విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. ఎన్నో పరిశ్రమల్లో 74% - 100% విదేశీ పెట్టుబడికి అనుమతించారు.

ఇవిగో ఫలితాలు...

పీవీ సంస్కరణలతో కరెంటు ఖాతా లోటు తగ్గుముఖం పట్టటం ప్రారంభమైంది. నెమ్మదిగా ద్రవ్వోల్బణం అదుపులోకి రావటంతో పాటు ఇతర రంగాలు కుదుటపడ్డాయి. అంతేగాక కొత్తగా ప్రైవేటు రంగానికి, విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన రంగాలకు పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. కొద్దికాలానికే సంస్కరణల ఫలాలు అందివచ్చి చాలా రంగాలు కళకళలాడాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరగటం ప్రారంభమైంది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవలసిన అసవరం కలగలేదు. ఈ రోజు మనదేశం చేతిలో 500 బిలియన్లకు పైగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి. అంతేకాదు, ఒకప్పుడు సంపన్నులకు పరిమితమైన విమాన ప్రయాణం సామాన్యులకు చేరువైంది. దేశవ్యాప్తంగా రహదార్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పెద్దఎత్తున జరిగింది. ప్రైవేటు రంగం లక్షల ఉద్యోగాలు కల్పించగలిగే స్థితికి ఎదిగింది. ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్‌ ఉందంటే దానికి పునాది పడింది పీవీ నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలతోనే.

ఇవీ పీవీ ముద్రలు:

నవోదయ విద్యాలయాలు

మానవవనరుల మంత్రిగా ఆయన నిర్ణయంతో నాణ్యమైన గురుకుల విద్యకివి శ్రీకారం చుట్టాయి.

భూసంస్కరణలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా తెచ్చిన భూసంస్కరణలు విప్లవ నిర్ణయం. దీంతో రైతులు భూ యజమానులయ్యారు.

ఆర్థిక స్వాతంత్య్రం

ప్రధానిగా చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశానికి ఆర్థిక స్వాతంత్య్రాన్ని తెచ్చాయి.

అణు అండాదండా...

భారత్‌ను పూర్తిస్థాయి అణ్వస్త్ర దేశంగా తీర్చిదిద్దే ప్రయోగాలు, క్షిపణుల తయారీకి ప్రోత్సాహం

అటు పశ్చిమం, ఇటు తూర్పు

ఇజ్రాయెల్‌తో దోస్తీ... ఆగ్నేయాసియాతో బంధం (లుక్‌ఈస్ట్‌), చైనాతోనూ చెలిమి, రష్యా, అమెరికాల మధ్య సమతౌల్యం

శ్రేయోరాజ్యం

కేవలం సంక్షేమంతో ప్రజల్ని ప్రభుత్వంపై ఆధారపడేలా కాకుండా.... వారు స్వయంసమృద్ధి సాధించేలా శ్రేయోరాజ్య పథకాలు

'అధికారంలో ఉన్నప్పుడు జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది'- పీవీ

ఇదీ చదవండి:పీవీ ప్రత్యేకం: తెలుగు కీర్తి.. పాములపర్తి

Last Updated : Jun 28, 2020, 9:33 AM IST

ABOUT THE AUTHOR

...view details