తెలంగాణ

telangana

By

Published : Sep 10, 2020, 7:29 AM IST

ETV Bharat / business

ఇక ఖాతాదార్లకు ఇంటికే బ్యాంకు సేవలొస్తాయ్​!

బ్యాంకింగ్ సేవలను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఖాతాదార్ల ఇంటి వద్దకే సేవలను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. ఈజ్‌ సంస్కరణలో భాగంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు.

PSB customers! Enjoy doorstep financial services from next month
ఇక ఖాతాదార్లకు ఇంటికే బ్యాంకు సేవలొస్తాయి!

ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) ఖాతాదార్లకు ఇంటి వద్దకే బ్యాంకింగ్‌ సేవలు అందించే కార్యక్రమాన్ని బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రారంభించారు. 2018లో ఆర్థిక సేవల విభాగం ప్రవేశపెట్టిన ఈజ్‌ సంస్కరణలో భాగంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. వినియోగదార్లకు సులభంగా, సౌకర్యవంతంగా సేవలను అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆర్థిక సేవల కార్యదర్శి దేవాశిష్‌ పాండా అన్నారు. దేశవ్యాప్తంగా 100 కేంద్రాల వద్ద ఎంపిక చేసిన సేవల సంస్థలు నియమించిన బ్యాంకింగ్‌ ఏజెంట్లు ఇంటింటికి వెళ్లి బ్యాంకింగ్‌ సేవలను అందిస్తారని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే.. ప్రస్తుతం చెక్‌లు, డిమాండ్‌ డ్రాఫ్ట్‌ల సేకరణ, కొత్త చెక్‌ బుక్‌ కోసం దరఖాస్తులు, 15జీ/ 15హెచ్‌ ఫారాలు అందివ్వడం, అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ కోసం వినతులు లాంటి ఆర్థికేతర (నాన్‌ ఫైనాన్షియల్‌) సేవలను ఇంటి వద్దకే బ్యాంకులు అందిస్తున్నాయి. వచ్చే నెల నుంచి ఆర్థిక సేవలను కూడా ప్రారంభిస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాల్‌ సెంటర్‌, వెబ్‌ పోర్టల్‌ లేదా మొబైల్‌ యాప్‌ సాయంతో కనీస రుసుమును చెల్లించడం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన వినియోగదారులు ఇంటి వద్ద నుంచే బ్యాంకింగ్‌ సేవలను పొందొచ్చని తెలిపింది. కాగా.. ఈ తరహా సదుపాయం ముఖ్యంగా వయోవృద్ధులు, దివ్యాంగులకు బాగా ఉపయోగపడనుంది.

ఆర్థిక వ్యవస్థ వృద్ధికి బ్యాంకులే ఉత్ప్రేరకం

ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంలో బ్యాంకులు ఉత్ప్రేరకంగా పనిచేయనున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. సామర్థ్యం పెంపునకు, వృద్ధికి డిజిటల్‌ సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని బ్యాంకులకు ఆమె సూచించారు. ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజన పథకం విజయవంతంలో బ్యాంకులు పోషించిన పాత్రను ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాలకు బ్యాంకింగ్‌ సేవలు చేరువకాలేదని పీఎస్‌బీల ద్వారా ఇంటి వద్దకే బ్యాంకింగ్‌ సేవల ప్రారంభం కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె చెప్పారు. సాధారణ స్థితికి వచ్చేందుకు వ్యాపార సంస్థలు సతమతమవుతున్న ఈ తరుణంలో.. వాటి సమస్యల పరిష్కారానికి కీలక పాత్ర పోషిస్తామనే భరోసాను బ్యాంకులు కల్పించాలని అన్నారు. ‘లాక్‌డౌన్‌ అనంతరం వ్యాపార కార్యకలాపాల పునరుద్ధరణ విషయంలోనూ అంతకుమించి అద్భుతమైన సేవలను అందించాల్సిన అవసరం ఉంద’ని నిర్మలా సీతారామన్‌ అన్నారు.

సంక్షేమ పథకాలపైనా దృష్టి పెట్టాలి..

బ్యాంకులు తమ కీలక వ్యాపార విభాగాలపై దృష్టి పెడుతూనే సంక్షేమానికీ ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ‘రుణాలివ్వడం, తద్వారా ఆదాయాన్ని ఆర్జించాలనే మీ ముఖ్య విధిని మర్చిపోకూడదు. ఓ వైపు ఆ పని చేస్తూనే.. మరోవైపు ఒక ప్రభుత్వ రంగ సంస్థగా ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమానికి సంబంధించిన కొన్ని పనులనూ మీరు చేయాల’ని నిర్మలా తెలిపారు. బ్యాంకులో పని చేస్తున్న ప్రతి ఒక్క సిబ్బంది ప్రభుత్వ పథకాల వివరాలు తప్పక తెలుసుకొని ఉండాలని అన్నారు.

ఇదీ చదవండి: డాక్టర్‌ రెడ్డీస్‌ నుంచి రెమ్‌డెసివిర్‌ ఔషధం

ABOUT THE AUTHOR

...view details