కరోనా ఎన్నో కుటుంబాలకు కష్టాలను మిగులుస్తోంది. దీని ప్రభావం తగ్గినట్లే కనిపిస్తున్నా.. రానున్న రోజుల్లో ఎలాంటి ముప్పు పొంచి ఉందనేది అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో పిల్లల ఆర్థిక రక్షణకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం తప్పనిసరి అవసరమవుతోంది. పిల్లల కోసం పాలసీ తీసుకోవడం అంటే వారి పేరుతో తీసుకోవడం కాదు. ఆర్జించే తల్లి లేదా తండ్రి తన పేరుమీద పాలసీ తీసుకొని, అనివార్య పరిస్థితుల్లో పిల్లలకు ఉపయోగపడేలా ఉండాలి.
పిల్లల బీమా పాలసీలు వివిధ దశల్లో అవసరమైన మొత్తాలను సమకూరుస్తుంటాయి. ఉన్నత చదువులు, వారి వివాహంలాంటి సమయాల్లో ఈ పాలసీల నుంచి అవసరమైన మొత్తం తీసుకునే వీలుంటుంది.
ఎందుకు ప్రత్యేకం..
పెద్దలు తీసుకునే పిల్లల పాలసీలు మిగతా వాటితో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటాయి. సాధారణ పాలసీల్లో పాలసీదారుడు మరణించినప్పుడు పరిహారం చెల్లించిన తర్వాత పాలసీ రద్దవుతుంది. ఈ పాలసీలు.. పాలసీదారుడి మరణానంతరమూ కొనసాగుతాయి. బీమా సంస్థ పాలసీదారుడి బదులుగా ప్రీమియం చెల్లిస్తుంది. అంటే, పాలసీదారుడి పిల్లలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడటం కోసం వేవర్ ఆఫ్ ప్రీమియం అనే అనుబంధ పాలసీ ఉండటమే ఇందుకు కారణం. మీరు పిల్లల రక్షణ కోసం పాలసీ తీసుకునేటప్పుడు ఈ వేవర్ ఆఫ్ ప్రీమియం ఉందా లేదా అనేది తప్పకుండా చూడండి.
ఎలా పనిచేస్తుందంటే..
సాధారణ జీవిత బీమా పాలసీలో పాలసీదారుడు మరణిస్తే.. ఒకేసారి పరిహారం లభిస్తుంది. కానీ, చిన్నారుల ఆర్థిక రక్షణకు ఉపయోగపడే పిల్లల పాలసీల్లో పాలసీదారుడికి ఏదైనా జరిగితే.. వెంటనే నామినీగా ఉన్న వారికి పరిహారం లభిస్తుంది. ఆ తర్వాత ఆ పాలసీ వ్యవధి తీరేంత వరకూ కొనసాగుతూనే ఉంటుంది. దీనికోసం ఆ పాలసీకి బీమా సంస్థ ప్రీమియం చెల్లిస్తూ ఉంటుంది. అంటే వాస్తవ పాలసీకి ఎలాంటి ఇబ్బందీ లేకుండా కొనసాగుతుందన్నమాట.