తెలంగాణ

telangana

ETV Bharat / business

సొంతింటి కలకు.. గడువు పెంచుతారా? - ప్రధాన్​ మంత్రి ఆవాస్ యోజన కింద సొంతింటికి లోన్​

సొంతింటి క‌ల నెర‌వేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో తీసుకొచ్చిన పథకం ప్రధాన మంత్రి ఆవాస్ యోజ‌న. సొంతిల్లు లేని ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద ఇల్లు క‌ట్టుకోవడం/కొనుగోలు చేయడం ద్వారా సబ్సిడీపై గృహ రుణాన్ని పొందవచ్చు. మరి ప్రస్తుతం కొత్త బడ్జెట్​ రాబోతుంది. ఈ నేపథ్యంలో అసలు పీఎంఈవై ఎలా పనిచేస్తుందో, ఎవరెవరికి వర్తిస్తుందో తెలుసుకుందాం

preconditions to get housing loan under pradhan manthri awaas yojana
సొంతింటి కలకు.. గడువు పెంచుతారా?

By

Published : Jan 31, 2021, 2:47 PM IST

తిండి.. బట్ట.. గృహవసతి ప్రతి ఒక్కరికీ దక్కాల్సిన కనీస అవసరాలు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, సొంతిల్లు అనేది చాలా మందికి కలగానే మిగిలిపోతోంది. భారతదేశ జనాభాలో దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి, కుటుంబాలే అధికం. అలాంటి వారికి తిండి, బట్టకు లోటు లేకపోయినా, కోట్లాది కుటుంబాలు అద్దె ఇళ్లలో ఇరుకు గదుల్లో జీవితాన్ని గడిపేస్తున్నాయి. అలాంటి వారి సొంతింటి క‌ల నెర‌వేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో తీసుకొచ్చిన పథకం ప్రధాన మంత్రి ఆవాస్ యోజ‌న. సొంతిల్లు లేని ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద ఇల్లు క‌ట్టుకోవడం/కొనుగోలు చేయడం ద్వారా సబ్సిడీపై గృహ రుణాన్ని పొందవచ్చు. అత్యధికంగా రూ.2.67లక్షల వరకూ రాయితీ పొందే అవకాశం ఉంది. కేవలం అత్యల్ప ఆదాయ వర్గాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందనుకుంటే పొరపాటే, వార్షిక ఆదాయం రూ.18లక్షల వరకూ ఉన్న వాళ్లు కూడా ఈ పథకం కిందకు వస్తారు. 2022 నాటికి అత్యధికమందికి సొంతిల్లు అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. కరోనాతో కుదేలైన రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊతం ఇచ్చేలా తాజా బడ్జెట్‌లో నిర్ణయాలు వెలువడతాయని అటు రియల్‌ ఎస్టేట్‌ రంగాల వారు, ఇటు సామాన్య జనం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు పీఎంఈవై ఎలా పనిచేస్తుంది. ఎవరెవరికి వర్తిస్తుందో ఓసారి చూద్దాం!

నాలుగు కేటగిరీలకు మాత్రమే పీఎంఈవై

ఆర్థికంగా బ‌ల‌హీన వ‌ర్గాలు(ఈడ‌బ్ల్యూఎస్‌), త‌క్కువ ఆదాయం గ‌ల(ఎల్ఐజీ) వ‌ర్గం, మధ్య ఆదాయ వర్గం-1(ఎంఐజీ-1), మధ్య ఆదాయం వర్గం2(ఎంఐజీ-2) అంటూ నాలుగు కేటగిరీలుగా వర్గీకరించారు. వీరికి మాత్రమే ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం వర్తిస్తుంది.

ఈడబ్ల్యూఎస్‌ వారికి షరతులు ఇవి..

వార్షిక కుటుంబ ఆదాయం రూ.0-3 లక్షల మ‌ధ్య ఉన్నవారు ఈడబ్ల్యూఎస్(ఆర్థికంగా బలహీన వర్గాలు) కిందకు వస్తారు. రూ.6 లక్షల గృహ‌రుణ వ‌డ్డీపై 6.50 శాతం స‌బ్సిడీకి అర్హులు. రుణ కాల‌ప‌రిమితి మొత్తానికి లేదా గ‌రిష్టంగా 20ఏళ్లు. వీటిలో ఏది త‌క్కువైతే ఆ కాలావ‌ధికి స‌బ్సిడీ ప్రయోజ‌నం వ‌ర్తిస్తుంది. 30 చ‌ద‌ర‌పు మీట‌ర్లు లేదా 322 చ‌ద‌ర‌పు అడుగుల కార్పెట్ ఏరియా ఉండాలి. రూ.6 లక్షల పైన అద‌నంగా ఉండే రుణానికి స‌బ్సిడీ వ‌ర్తించ‌దు.

త‌క్కువ ఆదాయం గ‌ల(ఎల్ఐజీ) వ‌ర్గం

వార్షిక కుటుంబ ఆదాయం రూ.3-6 లక్షల మ‌ధ్య ఉన్నవారు రూ.6 లక్షలపై గృహ‌రుణ వ‌డ్డీపై 6.5 శాతం స‌బ్సిడీకి అర్హులు. రుణ కాల‌ప‌రిమితి మొత్తానికి లేదా గ‌రిష్టంగా 20ఏళ్లు. వీటిలో ఏది త‌క్కువైతే ఆ కాలావ‌ధికి స‌బ్సిడీ ప్రయోజ‌నం వ‌ర్తిస్తుంది. 60 చ‌ద‌ర‌పు మీట‌ర్లు లేదా 646 చ‌ద‌ర‌పు అడుగుల కార్పెట్ ఏరియా ఉండాలి. రూ.6లక్షల పైన అద‌నంగా ఉండే రుణానికి స‌బ్సిడీ వ‌ర్తించ‌దు.తొలుత ఈ పథకాన్ని బ‌ల‌హీన వ‌ర్గాలు(ఈడ‌బ్ల్యూఎస్‌), త‌క్కువ ఆదాయం గ‌ల(ఎల్ఐజీ) వర్గాల వారికి వర్తింపజేశారు. ఆ తర్వాత మధ్య ఆదాయ వర్గం-1, 2లకు కూడా అందించారు.

ఎంఐజీ-1,2

వార్షిక కుటుంబ ఆదాయం రూ.6-12లక్షల మధ్య ఉన్న వారు రూ.9లక్షల గృహ రుణానికి అర్హులు. రుణ కాలపరిమితి మొత్తానికి లేదా గరిష్టంగా 20ఏళ్లు. వీటిలో ఏది తక్కువైతే ఆ కాలావధికి సబ్సిడీ ప్రయోజనం వర్తిస్తుంది. 160 చదరపు మీటర్లు లేదా 1722 చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియా ఉండాలి. ఇక వార్షిక కుటుంబ ఆదాయం రూ.12-18లక్షల మధ్య ఉన్న వారు రూ.12లక్షల వరకూ గృహరుణానికి అర్హులు. రుణ కాలపరిమితి మొత్తానికి లేదా గరిష్టంగా 20ఏళ్లు. 200 చదరపు మీటర్లు లేదా 2100 చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియా ఉండాలి.

ఈడబ్ల్యూఎస్‌, ఎల్‌ఐజీ కేటగిరీలు కిందకు వచ్చే వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే చివరి తేదీ 31-03-2022గా నిర్ణయించారు. అంటే దాదాపు ఇంకా ఏడాది కాలం ఉంది. అదే ఎంఐజీ-1,2 కేటగిరీల వాళ్లకు 31-03-2021 తర్వాత ఈ పథకం వర్తించదు.

ఇదీ చదవండి:బడ్జెట్ 2021: అంకురాల ఆశలు నెరవేరేనా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details