తెలంగాణ

telangana

ETV Bharat / business

వరద నష్టానికి బీమా క్లెయిమ్​ చేయాలా? - వాహన బీమా క్లెయిమ్​లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇటీవల కురిసిన అసాధారణ వర్షాల కారణంగా చాలా మందికి తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. అలాంటి వారిలో ఎవరైనా బీమా తీసుకుని ఉంటే.. క్లెయిమ్ చేసుకోవడం ద్వారా కాస్త ఉపశమనం పొందొచ్చు. అయితే ఇలాంటి సమయాల్లో చేసే చిన్న పొరపాట్ల వల్ల క్లెయిమ్ తిరస్కరణకు గురికావచ్చు. మరి ఆ పొరపాట్లు ఏంటి? క్లెయిమ్ చేసుకునే ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అనే పూర్తి వివరాలు మీ కోసం.

Mistakes not to make in an insurance claim
బీమా క్లెయమ్​లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

By

Published : Oct 25, 2020, 12:53 PM IST

అనుకోకుండా కురిసే అధిక వర్షాలు మన జీవనానికి, ఆస్తికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. అటువంటి వైపరీత్యాల నుంచి బయటపడడానికి మనకున్న ఏకైక శాస్త్రీయ పద్ధతి బీమా పాలసీని తీసుకోవడం. మనం కోల్పోయిన ఆస్తుల విలువను పొందడానికి ఇది సహాయం చేస్తుంది. హౌస్ హోల్డర్ పాలసీ, ఇంటి పాలసీ, మోటారు పాలసీ, మొదలైన పాలసీలను కలిగిన వ్యక్తి క్లెయిమ్ సెటిల్మెంట్ ద్వారా కచ్చితంగా తగిన పరిహారం పొందుతారు. అయితే క్లెయిమ్ ప్రక్రియ అనుకున్నంత సులభం కాదు. క్లెయిమ్ దాఖలు చేసేటప్పుడు, పాలసీదారుడు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

క్లెయిమ్ కోసం వివరాలను సమర్పించండి:

భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు తగ్గు ముఖం పట్టిన వెంటనే, పాలసీదారుడు తన పాలసీ పత్రాలతో సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పాలసీ పత్రం పొందకపోతే, అప్పుడు సాఫ్ట్ కాపీ నుంచి పాలసీ సంఖ్యను గుర్తించండి. అనంతరం పాలిసీదారుడు పాలసీ తాలూకా నిబంధనలు, షరతులను క్షుణ్నంగా చదివి నష్టపరిహారాల జాబితాను సిద్ధం చేసుకుని బీమా సంస్థకు సమర్పించాలి. నష్టపరిహారాల జాబితాను సిద్ధం చేసే సమయంలో జాగ్రత్త వహించాలి. మీరు నష్టపోయిన వస్తువులను వాటి స్థానం నుంచి కదపకూడదు. ప్రభావిత ప్రాంతం లేదా దెబ్బతిన్న ఆస్తులను తనిఖీ చేసి, వాటి విలువను అంచనా వేయడానికి బీమా సంస్థ ఒక ప్రతినిధిని నియమిస్తుంది. అందువలన నష్టం ఎక్కడ జరిగిందో అక్కడే తనిఖీ చేయవలసి ఉంటుంది.

ఇటువంటి పరిస్థితులలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి బీమాదారులు తమ సొంత ప్రమాణాలను కలిగి ఉంటారు. ఫైన్ ప్రింట్ అనేది కవరేజ్ నుంచి మినహాయించే వాటి గురించి వివరించే పత్రం. ఒక పాలసీని కొనుగోలు చేసే సమయంలో, పాలిసీదారుడికి మినహాయింపుల గురించి తెలియకపోవచ్చు. పాలసీని కొనుగోలు చేస్తున్నప్పుడు, క్లెయిమ్స్ దాఖలు చేసేటప్పుడు పాలసీదారుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ జరిగిన నష్టాన్ని బీమా సంస్థ సరిగా అంచనా వేయలేదని మీరు భావించి దానితో సంతృప్తి చెందకపోతే, క్లెయిమ్ పరిష్కార రసీదుపై సంతకం చేసే ముందు అంచనా వేసిన విలువపై సమీక్ష చేయాలని ఒత్తిడి చేయవచ్చు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా నష్టపోయే వాటిలో మోటారు వాహనం ముఖ్యమైనది.

సమగ్ర మోటార్ బీమా పాలసీ అగ్ని ప్రమాదం, వరదలు, దొంగతనం మొదలైన కారణాల వలన జరిగే నష్టాలను కవర్ చేస్తుంది. ఒకవేళ వాహనం నీటిలో మునిగిపోతే దానిని పాలసీదారుడు ఫోటో తీయాల్సి ఉంటుంది లేదా వాహనాన్ని రహదారికి దూరంగా వేరొక ప్రదేశానికి తీసుకెళ్లి వాహనాన్ని ఫోటో తీసి క్లెయిమ్ సమయంలో దానిని ఫైల్ చేయాల్సి ఉంటుంది. బీమా సంస్థ ప్రతినిధి వాహనాన్ని తనిఖీ చేసిన ముందు పాలసీదారుడు వాహనాన్ని నడపడానికి ప్రయత్నించడం లేదా మరమ్మత్తు చేయించడానికి ప్రయత్నించకూడదు. ప్రామాణిక సమగ్ర పాలసీ కింద ప్లాస్టిక్ పార్ట్శ్, రబ్బర్ మొదలైన వాటి కోసం క్లెయిమ్ దాఖలు చేయకూడదు. కానీ మెకానిక్ పని, సంబంధిత భర్తీల కోసం అయ్యే మొత్తం ఖర్చులను కచ్చితంగా ఆశించవచ్చు. ఒకవేళ బీమా సంస్థ ఇటువంటి క్లెయిమ్లను తిరస్కరించినట్లయితే, పాలసీదారుడు తన అసంతృప్తిని నమోదు చేసి, క్లెయిమ్ మొత్తాన్ని సమీక్షించే అభ్యర్థనను చేయాల్సి ఉంటుంది.

క్లెయిమ్ ప్రక్రియలో సహనం పాటించండి:

పెద్ద స్థాయిలో ప్రకృతి వైపరీత్యం సంభవించిన పరిస్థితిలో తగిన శ్రద్ధతో, తక్కువ సమయంలోనే క్లెయిమ్ లను పరిష్కరించడం బీమాదారుడికి కూడా కష్టతరమైన విషయం. అందువలన బీమాదారుడి ఇబ్బందులను కూడా పాలిసీదారుడు అర్థం చేసుకుని, కొద్దిగా సహనంతో ఉండాల్సిన అవసరం ఉంది.

కేరళలో సంభవించిన వరద తరువాత, ప్రాణాలను, ఆస్తులను కోల్పోయిన వారికి సాధ్యమైనంత త్వరలో క్లెయిమ్లను పరిష్కరించాలని అందరు బీమాదారులకు ఐఆర్​డీఏఐ ఆదేశాలను జారీ చేసింది. జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, ఫసల్ బీమా యోజనలలోని ఖాతాదారుల క్లెయిమ్​లను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలని అన్ని జీవిత బీమా సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయంలో బీమాదారులు కూడా త్వరగా చర్యలు తీసుకుంటున్నారు.

ఒకవేళ బీమా సంస్థలు అందించే పరిష్కారం సంతృప్తికరంగా లేనట్లయితే, పాలిసీదారుడు వినియోగదారుల ఫోరం లేదా తగిన ఫోరంలలో ఈ అంశం గురించి ప్రస్తావించవచ్చు. కోల్పోయిన లేదా దెబ్బతిన్న ఆస్తి విలువను తిరిగి పొందే పూర్తి హక్కును పాలసీదారుడు కలిగి ఉంటాడు.

ఇదీ చూడండి:వరదలతో పాడైన వాహనాలకు బీమా వర్తిస్తుందా?

ABOUT THE AUTHOR

...view details