గత ఎనిమిదేళ్లలో క్రెడిట్ కార్డుల సంఖ్య మూడింతలు పెరిగి 6.2 కోట్లకు చేరినట్లు ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఈ కార్డుల ద్వారా నెలవారీ లావాదేవీలూ 4.7 రెట్లు పెరిగాయి. దీంతో క్రెడిట్ కార్డులు వినియోగిస్తున్న వారి సంఖ్య, తద్వారా ఖర్చు చేస్తున్న సొమ్ము కూడా పెరుగుతూ పోతోంది. అయితే, క్రెడిట్ కార్డు రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. తెలివిగా వినియోగిస్తేనే ప్రయోజనాలు. లేదంటే మనకు తెలియకుండానే నష్టపోతాం. మరి ఈ కార్డును ప్రయోజనకరంగా ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం.
బిల్లింగ్ సైకిల్‌కు కట్టుబడి ఉండండి
ప్రతి క్రెడిట్ కార్డుకు 50 రోజుల బిల్లింగ్ సైకిల్ ఉంటుంది. అంటే మీ బిల్లింగ్ సైకిల్‌లోని తొలిరోజు మీరు డబ్బు వాడుకుంటే.. తిరిగి చెల్లించడానికి మీకు 50 రోజుల సమయం ఉంటుంది. ఒకవేళ మీరు మీ బిల్లింగ్ సైకిల్‌లో 30వ రోజు సొమ్మును వినియోగించుకుంటే తిరిగి చెల్లించడానికి మరో 20 రోజులు ఉంటాయి. ఈ సమయంలోపు మీరు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఉదాహరణకు.. ఆగస్టు 10వ తేదీన మీ బిల్లింగ్ సైకిల్ ప్రారంభమవుతుందనుకోండి. సెప్టెంబరు 9వ తేదీ వరకు మీకు క్రెడిట్ కార్డు నుంచి ఖర్చు చేసే వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత నుంచి కొత్త స్పెండింగ్ సైకిల్ ప్రారంభమవుతుంది. అయితే, ఆగస్టు 10వ తేదీ నుంచి సెప్టెంబరు 9వ తేదీలోపు వాడుకున్న డబ్బును తిరిగి చెల్లించేందుకు సెప్టెంబరు 29వ తేదీ వరకు సమయం ఉంటుంది. సెప్టెంబరు 9వ తేదీ తర్వాత తీసుకున్న మొత్తం అక్టోబరు బిల్లింగ్ సైకిల్‌లోకి చేరుతుంది.
ఇక్కడ జాగ్రత్త సుమా..!
ఒకవేళ మీరు వాడుకున్న మొత్తాన్ని మీ బిల్లింగ్ సైకిల్ గడువు అయిపోయిన తర్వాత గనక తిరిగి చెల్లించకపోతే.. ప్రతి అదనపు రోజుకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. పైన చెప్పిన తేదీలను మరోసారి పరిగణనలోకి తీసుకుందాం. మీరు ఆగస్టు 10-సెప్టెంబరు 9 మధ్య రూ.10,000 ఖర్చు చేశారనుకుందాం. దీన్ని చెల్లించడానికి మీకు 29 సెప్టెంబరు వరకు సమయం ఉంటుంది. అలాగే అవసరం రీత్యా సెప్టెంబరు 11న రూ.5,000 తీసుకున్నారనుకుందాం. ఇది అక్టోబరు బిల్లింగ్ సైకిల్‌లో చేరుతుంది. అంటే ఈ రూ.5,000 చెల్లించడానికి మీకు అక్టోబరు 29 వరకు గడువు ఉంటుంది. కానీ, మీరు ఒకవేళ సెప్టెంబరు 29 నాటికి చెల్లించాల్సిన రూ.10 వేలు చెల్లించకపోతే.. సెప్టెంబరు 30 నుంచి రూ.10 వేలతో పాటు సెప్టెంబరు 11న తీసుకున్న రూ.5,000కు కూడా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలా రూ.10వేలు తిరిగి చెల్లించే వరకు మొత్తం రూ.15 వేలకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.