చెక్కుల ద్వారా చెల్లింపులను మరింత పటిష్ఠం చేసేందుకు పాజిటివ్ పే పద్ధతిని ప్రకటించింది భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ). రూ.50 వేలు, అంతకన్నా.. ఎక్కువ మొత్తంలో చెక్‌ల ద్వారా జరిపే చెల్లింపుల విషయంలో ఈ ప్రక్రియను వినియోగించనున్నట్లు తెలిపింది. ఈ పద్ధతి నిర్వహణ నిబంధనలను ఆర్బీఐ ఇంకా విడుదల చేయాల్సి ఉంది.
సంఖ్య పరంగా దాదాపు 20 శాతం, విలువ పరంగా 80 శాతం చెక్కులు పాజిటివ్ పే ప్రక్రియలోకి రానున్న నేపథ్యంలో.. ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
పాజిటివ్ పే అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?
పాజిటివ్ పే ప్రకారం.. చెక్కులు ఇవ్వాలనుకునే వ్యక్తులు అందుకు సంబంధించిన వివరాలను చెక్కు ఇవ్వటానికంటే ముందే బ్యాంకుకు తెలియజేయాల్సి ఉంటుంది. ఖాతా సంఖ్య, చెల్లించే మొత్తం, చెక్కు అందుకుంటున్న వ్యక్తి పేరు, చెక్కు నంబరు, చెక్కు తేదీ వంటి వివరాలు ఇందులో పొందుపరచాలి.
దీనితో ఆ వివరాలన్నింటినీ బ్యాంకులు నమోదు చేసుకుని పెట్టుకుంటాయి. చెక్కు తీసుకున్న వ్యక్తి బ్యాంకుకు వచ్చినప్పుడు ఆ వివరాలను.. చెక్కు ఇచ్చిన వ్యక్తి అందించిన వివరాలతో సరిచూస్తారు. రెండింటిలో వివరాలు సరిపోలినట్లైతేనే ఆ వ్యక్తిని డబ్బులు చెల్లిస్తారు. లేదంటే.. చెక్కు ఇచ్చిన వ్యక్తికే దానిని తిరిగి ఇచ్చేస్తారు. దీనినే పాజిటివ్ పే అంటారు.
ఐసీఐసీఐ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ పాజిటివ్ పే సేవలను 2016 నుంచి అందిస్తోంది. ఆ బ్యాంకుకు సంబంధించి ఐ-మొబైల్ యాప్‌లో చెక్కు వివరాలు, ముందు వైపు ఫొటో, వెనుకవైపు ఫొటోను.. చెక్కు ఇచ్చే ముందే నమోదు చేయవచ్చు.
"పాజిటివ్ పే చెక్కుల పద్ధతి ఆసక్తికరమైనది. రూ.50వేలు అంతకంటే ఎక్కువ విలువున్న చెక్కును అందించే వ్యక్తి.. బ్యాంకుకు చెక్కు సంబంధించిన వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. దీన్ని అమలు చేసినట్లైతే లోపాలు లేని వ్యవస్థ తయారౌతుంది."
- కే. శ్రీనివాస రావు, ప్రొఫెసర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్(ఐఐఆర్‌ఎం), హైదరాబాద్
మోసాలకు ఇలా చెక్..
బ్యాంకు జారీ చేసే చెక్కులు కాకుండా బయట ప్రింట్ చేసిన నకిలీ చెక్కులు, ఫోర్జరీ చెక్కులు.. పేరు మార్చటం, డబ్బుల విలువలో మార్పు చేయటం తదితర మోసాలను నియంత్రించటంలో పాజిటివ్ పే పద్ధతి చాలా సమర్థంగా పనిచేస్తుంది.