తెలంగాణ

telangana

ETV Bharat / business

త్వరలో వివాహమా? ఈ ఆర్థిక ప్రణాళిక మీ కోసమే..

పెళ్లి.. ఇద్దరు మనుషులు ఒక్కటై.. జీవితాంతం కలిసి ఉండే ఓ అమూల్యమైన బంధం.పెళ్లయ్యాక భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఒకరిపై ఒకరికి ప్రేమ? అనురాగాలు ఎంత అవసరమో ఆర్థికంగా స్థిరంగా ఉండటం అంతే అవసరం. చాలా మందికి సరైన ఆర్థిక ప్రణాళిక లేనందుకే సమస్యల్లో చిక్కుకుంటుంటారు. మీరు త్వరలో పెళ్లికి సిద్ధమవుతుంటే.. దానికి ముందే ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం ఉత్తమం. పెళ్లికి ముందే ఆర్థిక ప్రణాళిక ఎందకు అవసరం? దాని ఉపయోగమెంత? అనే విషయాలపై నిపుణుల సలహాలు, సూచనలు మీ కోసం.

tips for financial plan
కొత్తగా పెళ్లయ్యే వారి కోసం ఆర్థిక ప్రణాళిక

By

Published : Aug 14, 2020, 4:26 PM IST

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయనేది మనం తరచూ వింటూనే ఉంటాం. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. పెళ్లిళ్లు ఎక్కడ నిర్ణయమైనా.. పెళ్లి ఎలా జరిగినా.. పెళ్లి తర్వాత జీవించాల్సింది భూమి మీదే. పెళ్లి తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. వీటన్నింటి కంటే ముఖ్యంగా పెళ్లయ్యాక భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే.. అందుకు ఆర్థికంగా స్థిరంగా ఉండాలి. ఇందుకోసం ముందస్తు ఆర్థిక ప్రణాళిక ఎంతో అవసరం.
బ్యాంక్​ ఖాతా నుంచి స్మార్ట్ పెట్టుబడుల వరకు, భాగస్వాముల ఇద్దరి ఆర్థిక స్థితిని అంచనా వేయడం మొదలు అత్యవసర నిధి ఏర్పాటు చేయడం వరకు ఈ ప్రణాళిక ఉపయోగపడుతుంది.

ఆర్థిక పరిస్థితిపై అంచనా..

మీ భాగస్వామి ఆర్థిక అలవాట్లు, ఆర్థిక స్థితి గురించి తెలుసుకునేందుకు.. ఆర్థిక విషయాలపై మీ భాగస్వామితో నేరుగా మాట్లాడటం మంచిది. దీని వల్ల మీ భాగస్వామికి ఏమైనా రుణాలు ఉన్నాయా? క్రెడిట్​ కార్డు బిల్లులు చెల్లించాలా? అనే విషయాలు తెలుసుకోవచ్చు. వీటితో పాటు మీ భాగస్వామి పెట్టుబడుల గురించి కూడా ఒక అవగాహనకు రావచ్చు. ఒక వేళ మీ భాగస్వామి అప్పుల్లో ఉంటే.. వాటిని తీర్చే ప్రణాళిక గురించి చర్చించాలి, వాటిని తీర్చేందుకు మీ వంతు కృషి చేయాలి.

ఆర్థిక స్థితిపై అంచనా

ఉమ్మడి బ్యాంక్ ఖాతా..

పెళ్లయ్యాక మీ ఆర్థిక స్థితిని మీరు చూసుకునే పనిలేదు అనుకోవడం (ముఖ్యంగా అమ్మయిల్లో) పొరపాటు. పెళ్లి తర్వాత కూడా మీ సంపాదనకు మీరే యజమాని అనే విషయాన్ని మరిచిపోవద్దు. మీ ఆర్థిక స్థితిని మీ భాగస్వామితో చర్చిస్తూ మీరే వాటిని నిర్వహించుకోవచ్చు. మీ భాగస్వామితో కలిసి ఉమ్మడి బ్యాంకు ఖాతా తీసుకోవడం, పెట్టుబడి పెట్టడం ద్వారా సంపాదన, ఖర్చులు వంటి ఆర్థిక విషయాలపై ఒక అవగాహన వస్తుంది.
పెళ్లికి ముందే ఉమ్మడి బ్యాంక్ ఖాతా తెరవడం ద్వారా భవిష్యత్​లో భార్యా భర్తల మధ్య ఆర్థిక పరంగా ఎలాంటి తగువులు ఉండవు.

ఉమ్మడి బ్యాంక్ ఖాతా

ఆర్థిక లక్ష్యాలను తెలుసుకోవడం..

మీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. కాబోయే భాగస్వామి ఆర్థిక లక్ష్యాలపై మీకు.. మీ లక్ష్యాలపై మీ భాగస్వామికి అవగాహన ఉండటం చాలా ముఖ్యం. ఇది మీ భాగస్వామి ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చేందుకు మీరు ఎంత వరకు సహాయం చేయగలరనే విషయాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది.

అత్యవసర నిధి..

పెళ్లికి ముందే ప్రతి ఒక్కరు ఏర్పాటు చేసుకోవాల్సిన వాటిలో ముఖ్యమైంది అత్యవసర నిధి. ఆర్థిక సమస్యలనేవి ఎవ్వరికీ చెప్పిరావు. అందుకే.. సమస్యల నుంచి గట్టెక్కేందుకు ఈ అత్యవసర నిధి ఉపయోగపడుతుంది. కొత్తగా పెళ్లయ్యే వాళ్లకే కాదు ప్రతి ఒక్కరికీ.. ఈ అత్యవసర నిధి చాలా ముఖ్యం. కనీసం 6 నెలల వరకు మీకు ఆదాయం లేకున్నా.. మీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండే విధంగా ఈ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం మంచిది.

అత్యవసర నిధి

పెట్టుబడులు..

కొత్తగా పెళ్లైన వాళ్లలో చాలా మందికి తలెత్తే సందేహాల్లో ముఖ్యమైనది.. ఎలాంటి సాధనాల్లో పెట్టుబడి పెట్టాలి అనేదే. అయితే ఎక్కడ పెట్టుబడి పెట్టినా ఇద్దరి రిస్క్​ స్థాయిలను అంచనా వేసుకునే ముందడుగు వేయడం చాలా ఉత్తమం.
ఉదాహరణకు.. మీరు పెద్ద టీవీ కొనాలనుకుంటే అది స్వల్ప కాలిక లక్ష్యం. ఇల్లు లేదా కారు కొనాలనుకోవడం, రిటైర్మెంట్​ కోసం ప్రణాళిక, మీ పిల్లల వివాహాల కోసం పొదుపు చేయడం వంటివి దీర్ఘకాలిక లక్ష్యాలు. మీరు లక్ష్యాన్ని నేరవేర్చుకునేందుకు అవసరమైన సమయం, మీ ఆదాయం, రిస్క్​ సామర్థ్యాలను ఇక్కడ పరిగణనలోకి తీసుకుని పెట్టుబడులు పెట్టాలి. ఫిక్సిడ్​ డిపాజిట్​ వంటివి సురక్షితమైన పెట్టుబడులుగా చెప్పవచ్చు. అయితే ఇందులో రిటర్ను కూడా తక్కువగానే ఉంటుంది. రిస్క్​ తీసుకునేందుకు సిద్ధం అనుకుంటే.. ఈక్విటీల్లో కూడా మీరు పెట్టుబడులు పెట్టవచ్చు. దీర్ఘ కాలంలో ఈక్విటీల్లో పెట్టుబడులు భారీ మొత్తంలో రిటర్నులు ఇస్తాయి. మీ ఆర్థిక లక్ష్యాలనూ నెరవేరుస్తాయి.

పెట్టుబడులు

ఆర్థిక వ్యవహారాలు ఎవరు చూడాలి?

ఒకవేళ పెళ్లయ్యాక భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తే.. ఏ ఖర్చులు ఎవరు చూసుకోవాలో ముందే నిర్ణయించుకోవడం ఉత్తమం. ఉదాహరణకు ఇంటి అవసరాల బాధ్యత భార్య చూస్తే.. ఈఎంఐలు ఇతర చెల్లింపులు లాంటివి భర్త చూసుకోవాలి. దీనికి రివర్స్​లోనూ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరో ఒక్కరే సంపాదిస్తుంటే.. ఖర్చుల నిర్వహణ గురించి చర్చించాలా వద్దా అనే విషయాన్ని ఇద్దరూ కలిసి నిర్ణయించుకోవాలి. భవిష్యత్​లో ఇలాంటి విషయాల్లో అభిప్రాయభేదాలు రాకుండా ఇది ఉపయోగపడుతుంది.

టర్మ్​ ఇన్సూరెన్స్ ప్లాన్​లో పెట్టుబడి..

నిర్ణీత సమయం వరకు ఆర్థిక కవరేజీని ఇచ్చే జీవిత బీమా రకాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఒకటి. ఇది తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీని ఇస్తుంది. పాలసీ తీసుకున్న వ్యక్తి మధ్యలో మరణిస్తే.. నామినీకి ఆర్థిక భరోసా ఉంటుంది. 25 ఏళ్ల వయసున్న పురుషుడికి రూ.కోటి బీమా లభించాలంటే.. నెలకు రూ.930 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
మీరు లేకున్నా మీ భాగస్వామి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ పాలసీలు ఎంతగానో ఉపయోగపడతాయి.

టర్మ్​ పాలసీ

ఆరోగ్య బీమా అవసరం..

మీకు, మీ భాగస్వామి ఇద్దరికి మీరు పని చేసే సంస్థలు ఆరోగ్య బీమా ఇస్తున్నా.. మీకు ప్రత్యేకంగా మరో ఆరోగ్య బీమా ఉండటం ఎంతైనా అవసరం. ఎందుకంటే ఏదైనా పరిస్థితుల వల్ల ఉద్యోగం మానేయాల్సి వస్తే.. ఇన్సూరెన్స్​ కూడా నిలిచిపోతుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణకు ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయాల్లో బీమా లేకుంటే.. ఆస్పత్రి ఖర్చులు భారీగా భరించాల్సిందే. దీనితో మరింత ఆర్థిక భారం పెరుగుతుంది.
ఇలాంటి సమమస్యల్లో చిక్కుకోకుండా.. మీరు, మీ భాగస్వామికి, తల్లిందండ్రులకు, పిల్లలకు కూడా కవరేజీని అందించే ఫ్యామిలీ ఫ్లోటర్​ ఆరోగ్య బీమా తీసుకోవడం ఉత్తమం.
ఈ ఆర్థిక సూత్రాలతో భవిష్యత్​లో వచ్చే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. భార్యాభర్తలిద్దరికీ ఒకరిపై మరొకరికి ప్రేమ, గౌరవంతో పాటు సరైన ఆర్థిక ప్రణాళిక ఉంటేనే జీవితం సుఖమయమవుతుంది. మీ దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగేందుకు ఇవన్నీ ఎంతో ముఖ్యం.

ఆరోగ్య బీమా

రచయిత: విరాల్​ భట్​, పర్సనల్ ఫినాన్స్​ నిపుణులు

  • గమనిక: ఈ కథనంలోని అన్ని అంశాలు రచయిత దృష్టి కోణంలో నుంచి రాసినవి మాత్రమే. వీటితో ఈటీవీ భారత్​కు, సంస్థ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు.
  • పర్సనల్ ఫినాన్స్ గురించి ఏమైనా సందేహాలు ఉంటే businessdesk@etvbharat.comను సంప్రదించవచ్చు.

ABOUT THE AUTHOR

...view details