పసిడి ధర ఎప్పుడూ స్థిరంగా ఉండదు. స్వల్పకాలంలోనే చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి. సాధారణంగా భారతీయులు పండుగల సమయంలో బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా దీవాళి పండుగ సమయంలో బంగారాన్ని కొనుగోలు చేయడం శుభప్రదంగా బావిస్తారు. భౌతిక బంగారాన్ని కాయిన్‌లు, బార్లు, ఆభరణాల రూపంలో కొనుగోలు చేస్తారు. ఈటీఎఫ్‌ల రూపంలో ఆన్‌లైన్ ద్వారా(ఈ-గోల్డ్) బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. మీరు కూడా బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే ఈ కింది విషయాలలో జాగ్రత్తవహించండి.
1. బంగారం ధర:
బంగారాన్ని కొనుగోలు చేసేముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది దాని ధర, వివిధ అంశాల ఆధారంగా బంగారం ధర మారుతుంది. ఇది ఒక్కో నగరంలో ఒక్కో మాదిరిగా మారుతూ ఉంటుంది. అలాగే దాని ధరను వివిధ సంఘాలు నిర్ణయిస్తాయి. బంగారం కొనుగోలు చేసే ముందు గ్రాము బంగారం ధరను, బాగా తెలిసిన ఒకటి కంటే ఎక్కువ షో రూమ్స్‌లో తనిఖీ చేయాలి లేదా విశ్వసనీయ వెబ్ సైట్లలో కూడా రేట్లు తనిఖీ చేయవచ్చు.
2. బంగారం స్వచ్ఛత:
బంగారం కొనుగోలు చేసేప్పుడు, తెలుసుకోవాలస్సిన మరొక ముఖ్య అంశం దాని స్వచ్ఛత. బంగారం స్వచ్ఛతను రెండు రకాలుగా లెక్కిస్తారు. మొదటిది గోల్డ్ క్యారెట్ మరొకటి ఫైన్‌నెన్స్. బంగారం స్వచ్ఛతను తెలుసుకునేందుకు చాలా మంది ఉపయోగించే విధానం క్యారెట్. 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు. కానీ ప్రస్తుతం మనం కొనుగోలు చేసే బంగారం ఆభరణాలు 22 క్యారెట్లవి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కాయిన్‌లు, బార్లు రూపంలో కొనుగోలు చేయవచ్చు.
3. హాల్ మార్కింగ్:
హాల్‌మార్క్ ఉన్న బంగారు నాణేలు, ఆభరణాలనే కొనుగోలు చేయాలి. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారుడు మోసపోకుండా భారత ప్రభుత్వ బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్)ను ఏర్పాటు చేసింది. మీరు కొనుగోలు చేసిన బంగారు ఆభరణం బీఐఎస్ హాల్ మార్క్ ను కలిగి ఉన్నట్లైతే, దానికి మరింత ప్రాముఖ్యం ఉంటుంది. హాల్ మార్క్ నగలను విక్రయించే దుకాణాల పూర్తి జాబితాను మీరు బీఐఎస్ వెబ్ సైట్ లో చూడవచ్చు. ఒకవేళ మీకు బంగారు హాల్ మార్క్ గురించి ఫిర్యాదులు లేదా ఆందోళన ఉంటే, మీరు బీఐఎస్‌ను నేరుగా సంప్రదించవచ్చు.
4. తయారీ రుసుములు:
ఇది మీరు కొనుగోలు చేసే దుకాణాదారుడు, ఆభరణం డిజైన్, తయారుచేసే వ్యక్తుల ఆధారంగా మారుతూ ఉంటుంది. బంగారాన్ని కాయిన్ రూపంలో కొనుగోలు చేసిన అనంతరం ఆభరణంగా తయారు చేసేందుకు 8 నుంచి 16 శాతం తయారీ ఛార్జీలు విధిస్తారు.
5. కొనుగోలు చేసే విధానం:
బంగారాన్ని కొనుగోలు చేసేందుకు పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ప్రజలు స్థానిక స్వర్ణకారుని వద్ద లేదా బ్రాండెడ్ ఆభరణాల షోరూమ్స్‌లో బంగారాన్నికొనుగోలు చేస్తుంటారు. అయితే ఇందుకు గానూ, వెబ్‌సైట్, ఎమ్ఎమ్‌టీసీ వంటి ఇతర మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మీరు గోల్డ్ కాయిన్‌ను కొనుగోలు చేయాలంటే బ్యాంకులను కూడా సంప్రదించవచ్చు. చాలా బ్యాంకులు వేరు వేరు విలువలు కలిగిన 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్‌లను విక్రయిస్తున్నాయి.