దేశీయంగా బంగారం ధరలు ఇటీవల కాస్త దిద్దుబాటుకు లోనవుతున్నాయి. ఇప్పుడే దీపావళి సందడి కూడా మొదలైన నేపథ్యంలో పసిడి కొనుగోళ్లు పెరగొచ్చనే అంచనాలు పెరిగిపోయాయి. అయితే నిపుణులు మాత్రం స్వల్ప, మధ్యస్థకాలానికి ధరలు మళ్లీ పెరుగుతాయనే అంచనా వేస్తున్నారు.
బంగారం ధర ఎందుకు తగ్గిందంటే..
తాము అభివృద్ధి చేసిన కొవిడ్ 19 టీకా 90 శాతం ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు ఔషధ సంస్థ ఫైజర్ ప్రకటన చేసిన తర్వాత.. ఈ వారం ఆరంభంలో పసిడి ధర 10 గ్రాములకు రూ.50 వేల దిగువకు చేరింది. అయితే మళ్లీ ఒక్క రోజులోనే రూ.50,600 వద్దకు పెరిగింది.
'ఇటీవల తగ్గిన బంగారం ధర ఇంతకు ముందు ర్యాలీని అందిపుచ్చుకోని వారికి మంచి అవకాశమిచ్చింది. రానున్న నెలల్లో పసిడి సానుకూలంగా సాగే వీలుంది.' అని ఏంజెల్ బ్రోకింగ్ కమోడిటీ, కరెన్సీస్ విభాగం అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) ప్రతామేష్ మాల్యా అంటున్నారు.
రెండంకెల లాభం..
పెరిగిన ధరలు ఈ ఏడాది పసిడి పెట్టుబడులకు రెండంకెల లాభాలను ఇచ్చాయని ప్రతామేష్ మాల్యా చెప్పారు. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి, చాలా దేశాల్లో తక్కువ వడ్డీ రేట్లు, సులభతరమైన లిక్విడిటీ వంటివి రానున్న నెలల్లో పసిడి ధరలు మరింత పెరిగేందుకు దోహదం చేస్తాయని చెబుతున్నారు. వచ్చే దీపావళి నాటికి దేశంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.56 వేలకు చేరొచ్చని అంచనా వేశారు.