కనీస రిటర్నులకు హామీనిచ్చే ఒక పింఛను పథకాన్ని తీసుకురావడానికి ద పింఛన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(పీఎఫ్‌ఆర్‌డీఏ) కసరత్తు చేస్తోంది. పీఎఫ్‌ఆర్‌ఏడీఏ ఛైర్మన్ సుప్రతిమ్ బంద్యోపాధ్యాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతిపాదిత పథకం విధివిధానాలపై పింఛన్ ఫండ్‌లు, గణాంక సంస్థలతో చర్చిస్తున్నట్లు ఆయన వివరించారు.
"పీఎఫ్‌ఆర్‌డీఏ చట్టం కింద కనీస ప్రతిఫలాలకు హామీనిచ్చే పథకాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. పీఎఫ్ పథకాల కింద వచ్చే నిధులను మార్క్-టు-మార్కెట్‌లో నిర్వహిస్తారు. కాబట్టి మార్కెట్ కదలికలను బట్టి వాటి విలువలో కొంత ఊగిసలాట కనిపించవచ్చు. అయితే కొంత మంది కనీస హామీని కోరుకుంటారు. ఈ నేపథ్యంలోనే మా పింఛన్ ఫండ్ మేనేజర్లుతో చర్చిస్తున్నాం."
-సుప్రతిమ్ బంద్యోపాధ్యాయ్, పీఎఫ్‌ఆర్‌ఏడీఏ ఛైర్మన్