తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీఆర్ దాఖలు చేస్తే.. ఈజీ రుణాలు, వీసా కూడా?

ఆదాయపు పన్ను చెల్లించటం ప్రతి ఒక్కరి బాధ్యత. నిబంధనల ప్రకారం మినహాయింపు లేని వారంతా తప్పకుండా రిటర్నులు దాఖలు చేయాలి. రిటర్ను దాఖలు చేయటం వల్ల దేశాభివృద్ధిలో పాత్ర పోషించటమే కాకుండా వ్యక్తిగతంగా కూడా పలు ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Additional Benefits with ITR
ఐటీఆర్​తో అదనపు ప్రయోజనాలు

By

Published : Jun 28, 2021, 8:02 PM IST

దేశం అభివృద్ధి చెందాలన్నా.. మౌలిక సదుపాయాలు మెరుగుపడాలన్నా ప్రభుత్వాలు భారీగా ఖర్చు చేయాల్సిందే. అయితే ప్రభుత్వాలు ఖర్చు చేసేందుకు.. వివిధ ఆదాయ మార్గాలు ఉన్నాయి. అందులో పన్నులు కీలకం. ఆదాయపు పన్ను కూడా ముఖ్యమైంది. ప్రభుత్వ పన్నుల ఆదాయంలో వ్యక్తిగత ఆదాయపు పన్నుల వాటా దాదాపు 25 శాతం.

అందుకే అర్హులైన ప్రతి పౌరుడు.. ఆదాయపు పన్ను చెల్లించటం ద్వారా దేశాభివృద్ధిలో పాలు పంచుకున్నట్లే. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ కార్యక్రమాలు, వివిధ రంగాల అభివృద్ధి కోసం ఇచ్చే సబ్సిడీలు, దేశ రక్షణ.. ఇలా ప్రభుత్వం చేసే పనిలో పన్ను చెల్లింపుదారుడి పాత్ర ఉన్నట్లే. కాబట్టి నిబంధనలకు లోబడి అర్హత ఉన్న అందరూ రిటర్నులు దాఖలు చేయాలని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు.

ఐటీ రిటర్నులు దాఖలు చేయడం ద్వారా దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవడం మాత్రమే కాదు.. చెల్లించిన వారికి వ్యక్తిగతంగా కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇతరులతో పోలిస్తే.. ఐటీఆర్ దాఖలు చేసిన వారికి కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు ఉంటాయి. ఆ వివరాలను పరిశీలిద్దాం.

వేగంగా రుణాల మంజూరు..

రుణం కావాల్సినప్పుడు ఐటీఆర్ చాలా ఉపయోగపడుతుంది. ఐటీఆర్ ఉన్నవారికి బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్​బీఎఫ్​సీలు)రుణాన్ని సులభంగా ప్రాసెసింగ్ చేస్తుంటాయి. రుణ మంజూరు కూడా త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.

గృహ, కారు రుణం తీసుకునే వారిని.. బ్యాంకులు, ఫినాన్స్ కంపెనీలు మూడేళ్ల ఐటీఆర్​ను అడుగుతుంటాయి.

వీసా ప్రాసెసింగ్

ఐటీఆర్ అనేది ఆదాయానికి సంబంధించి ధ్రువీకరణ పత్రాల్లో ఉత్తమమైనదిగా పరిగణించవచ్చు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా లాంటి ప్రముఖ దేశాల ఎంబసీలు వీసా ప్రాసెసింగ్ కోసం ఐటీఆర్​ను సమర్పించాలని కోరుతుంటాయి. ఐటీఆర్ ఉన్న వారికి త్వరగా వీసా అందే అవకాశం ఉంటుంది.

నష్టాలను మరో ఏడాదిలో భర్తీ

వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థలో.. ఒక సంవత్సరం నష్టాలు రావొచ్చు. మరుసటి ఏడాది లాభం రావొచ్చు. అయితే ఐటీఆర్ దాఖలు చేసినట్లయితే మొదటి ఏడాది నష్టాలను రెండో ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు.

అంటే.. క్రితం ఏడాది నష్టాల వివరాలను చూపించి.. ఈ ఏడాది పన్నుల భారం తగ్గించుకోవచ్చు. ఐటీఆర్ లేకుంటే.. ఈ ఏడాది వచ్చిన లాభాలను మాత్రమే పరిగణించి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

రీఫండ్

టీడీఎస్(ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) రూపంలో అప్పటికే పన్ను చెల్లించి ఉంటాం కాబట్టి.. రిటర్న్స్ దాఖలు చేయటం వల్ల దానిని రీఫండ్ రూపంలో తిరిగి పొందవచ్చు.

ఎవరు రిటర్నులు దాఖలు చేయాలి?

  • ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం 60 ఏళ్ల లోపు వయస్సు వారు.. రూ.2.5 లక్షలకు మించి వార్షిక ఆదాయం గడిస్తుంటే.. రిటర్ను సమర్పించాలి.
  • 60-80 ఏళ్ల వయస్సు వారికి(వృద్ధులు/సీనియర్ సిటిజన్స్) రూ.3 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్నట్లయితే రిటర్నులు దాఖలు చేయాలి.
  • 80 ఏళ్లు ఆపై వయస్సున్న వారు.. రూ.5 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం గడిస్తుంటే రిటర్నులు దాఖలు చేయాలి.

ప్రభుత్వం 2020లో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రజలకు పాత పద్ధతి లేదా కొత్త పద్ధతిలో ఒకదానిని ఎంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. కొత్త పద్ధతి ప్రకారం వయస్సుతో సంబంధం లేకుండా మౌలిక మినహాయింపును రూ. 2.5 లక్షలుగా నిర్ణయించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details