దేశంలోని ప్రధాన హోల్సేల్ మార్కెటలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. దిల్లీ, ముంబయి, చెన్నైలలో శనివారంతో పోలిస్తే.. ఉల్లి రేటు ఒక్క రోజులోనే కిలోకు రూ.10 వరకు తగ్గింది. ధరల నియంత్రణలో భాగంగా వ్యాపారుల వద్ద ఉల్లి నిల్వలపై కేంద్రం ఇటీవల ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలోనే మార్కెట్లో ఉల్లి లభ్యత పెరిగి.. ధరలు తగ్గుముఖం పట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఒక్క రోజులో ధరల తగ్గుదల ఇలా..
ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన.. మహారాష్ట్రలోని లసల్గావ్లో కిలో ఉల్లిపాయల రేటు ఒక్కరోజులో రూ.5 తగ్గింది. ఫలితంగా ధర రూ.51కి దిగొచ్చింది. ఇతర ప్రధాన మార్కెట్లయిన చెన్నైలో.. ఉల్లి హోల్ సేల్ ధర కిలో రూ.66కి చేరింది. అక్టోబర్ 24న ఇక్కడ కిలో ధర రూ.76గా ఉండేది.
ముంబయి, బెంగళూరు, బోపాల్ మార్కెట్లలోనూ కిలో ఉల్లి ధర రూ.5 నుంచి రూ.6 తగ్గి.. వరుసగా రూ.70, రూ.64, రూ.40కి చేరింది.