తెలంగాణ

telangana

ETV Bharat / business

పండుగల వేళ ఈ ఉల్లి కష్టాలేల?

పండుగల ముందు సామాన్యులకు ఉల్లి ధరలు భారంగా మారుతున్నాయి. చాలా ప్రాంతాలలో కిలో ఉల్లి ధర రూ.80-90 మధ్య పలుకుతోంది. కొన్ని మార్కెట్లలో కిలో రూ.100 దాటిన దాఖలాలు ఉన్నాయి. కొన్ని రోజులు ముందు వరకు సాధారణంగానే ఉన్న ఉల్లి ధరలు.. ఉన్నఫళంగా ఈ స్థాయిలో ఎందుకు పెరుగుతున్నాయనే ప్రశ్నకు మార్కెట్ వర్గాల సమధానాలు ఇలా ఉన్నాయి.

Heavy rains impact on onion prices
భారీగా పెరుగుతున్న ఉల్లి ధరలు

By

Published : Oct 24, 2020, 4:02 PM IST

కరోనా కారణంగా ఇటీవల ఆదాయాలు తగ్గి.. సామాన్యులు నిత్యావసరాలు తప్ప ఇతర కొనుగోళ్లకు మొగ్గు చూపలేదు. అయితే ఇప్పుడు నిత్యావసరాలు కూడా వారికి భారంగా మారుతున్నాయి. ముఖ్యంగా వంటల్లో కచ్చితంగా వాడే ఉల్లి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మరి.. పండుగ సమయాల్లో కోయకుండానే సామాన్యుడికి కంటతడి పెట్టిస్తున్న ఉల్లి ధరల పెరుగుదలకు కారణాలు ఏమిటి? ధరలు మళ్లీ సాధారణ స్థితికి చేరే అవకాశముందా? ఈ విషయంలో వ్యాపారులు ఏమంటున్నారు? ఉల్లి ధరల కట్టడికి ప్రభుత్వం చర్యలు ఎలా ఉన్నాయి?

సామాన్యుడికి ఉల్లి ధరల భారం

అసాధారణ వర్షాలే కారణం..

దేశవ్యాప్తంగా అసాధారణ వర్షాల వల్ల ఉల్లి పంట భారీగా దెబ్బతినడం.. ధరల పెరుగుదలకు కారణమంటున్నాయి మార్కెట్ వర్గాలు. అయితే ధరల్లో ఈ వృద్ధి తాత్కాలికమేనంటున్నారు మహారాష్ట్ర నాసిక్​లోని వ్యాపారులు.

నాసిక్​ ఉల్లి మార్కెట్​లో లోడ్ దింపుతున్న వ్యాపారులు

కర్ణాటకలోని శివమొగ్గ ఉల్లి మార్కెట్లోనూ ఉల్లి ధరలు సాధారణం కన్నా అధికంగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అసాధారణ వర్షపాతం నమోదవ్వడం వల్ల రాష్ట్రంలో ఉల్లి పంటకు భారీ నష్టం కలిగిందని.. ఈ కారణంగా మహారాష్ట్ర నుంచి ఉల్లి కొనుగోలు చేస్తున్నట్లు వివరిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటితో ఉల్లి ధర హోల్​సేల్ మార్కెట్​లో రూ.70-80 మధ్య ఉంటే.. రిటైల్ మార్కెట్​లో రూ.80-90 మధ్య ఉన్నట్లు తెలిపారు.

శివమొగ్గ మార్కెట్​లో ఉల్లి కొనుగోలు చేస్తున్న జనం

దేశరాజధాని దిల్లీకి ఉల్లి ధరల ఘాటు తాకింది. 15-20 రోజుల ముందు వరకు రూ.30గా ఉన్న కిలో ధర ఇప్పుడు.. రూ.40-50 మధ్య పలుకుతోందని ఘాజీపూర్ సబ్జీ మండీ వ్యాపారులు చెబుతున్నారు. కర్ణాటకలో వర్షాలకు పంట నష్టం వాటిల్లడం వల్ల.. ఈ మార్కెట్​కు ఉల్లి సరఫరా తగ్గిందంటున్నారు.

లాక్‌డౌన్‌ సమయంలో కొనుగోలుదారులు కానరాక పంటను పొలాల్లోనే వదిలేసిన రైతులు... రోజుల వ్యవధిలో ఇంతటి మార్పా అని వినియోగదారులు బిత్తరపోయి చూస్తుండగానే- చిల్లర మార్కెట్లో(కొన్ని ప్రాంతాల్లో) ఉల్లి ధర కిలో రూ.100 వరకు ఎగబాకింది. ఈ నేపథ్యంలో ఉల్లి ధరల కట్టడికి కేంద్రం పలు చర్యలు ప్రారంభించింది.

పండుగల వేళ సామాన్యులకు ఉల్లి ధరల భారం

ధరల కట్టడికి కేంద్రం చర్యలు..

భారీ వర్షాలతో దేశవ్యాప్తంగా అసాధారణ స్థాయిలో పెరుగుతున్న ఉల్లి ధరలను అదుపు చేసేందుకు కేంద్రం ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా విదేశాల నుంచి ఉల్లి దిగుమతుల పెంపునకు అనుమతినిచ్చింది. దీనితో మార్కెట్​లో ఉల్లి సరఫరా, డిమాండ్​ మధ్య అంతరాన్ని తగ్గించి.. ధరలు అదుపు చేయొచ్చని భావిస్తోంది.

సరఫరా, డిమాండ్​ మధ్య అంతరాన్ని తగ్గించేందుకు బఫర్ స్టాక్స్​ నుంచి ఉల్లిని తీసుకునేందుకూ రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది.

ఇదీ చూడండి:రాష్ట్రాలకు కేంద్రం 'ఉల్లిపాయల ఆఫర్​'

ABOUT THE AUTHOR

...view details