భారత్‌లో తొలి కరోనా కేసు బయటపడి దాదాపు 11 నెలలు కావొస్తోంది. ప్రపంచదేశాలపై ప్రభావం చూపినట్లుగానే భారత ఆర్థిక వ్యవస్థనూ కరోనా తీవ్రంగా దెబ్బతీసింది. అప్పటికే వృద్ధిరేటు కనిష్ఠ స్థాయికి పడిపోతున్న సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను కరోనా మరింత కుంగదీసింది.
2020 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(జనవరి-మార్చి)లో దేశ జీడీపీ పదకొండేళ్ల కనిష్ఠానికి పడిపోయి.. 3.1 శాతానికి పరిమితమైంది. మార్చి చివరి వారంలో దేశవ్యాప్త లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. అప్పటినుంచి పరిస్థితులు మరింత కఠినంగా మారిపోయాయి. పరిశ్రమలు, వాణిజ్యం, మార్కెట్లు పతనమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ నిలకడ కోల్పోయింది. ఫలితంగా ఆ తర్వాతి త్రైమాసికంలో జీడీపీ అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఏప్రిల్-జూన్ మధ్య ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం దిగజారింది. సెప్టెంబర్ నాటికి కార్యకలాపాలు కాస్త పుంజుకున్నా.. జీడీపీ వృద్ధి మాత్రం ప్రతికూల పథంలోనే కొనసాగింది. మైనస్ 7.5 శాతం వృద్ధి రేటుతో భారత ఆర్థిక వ్యవస్థ సాంకేతికంగా సంక్షోభంలో పడిపోయింది.
కేరళలో జనవరి 27న తొలి కేసు నమోదు కాగా.. 11 నెలల తర్వాత వీటి సంఖ్య కోటి మార్క్ దాటింది. ఈ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎలా ఉంది. ఎకానమీలో మూలస్తంభాలుగా పరిగణించే పలు రంగాలు ఎలా స్పందించాయో ఇప్పుడు పరిశీలిద్దాం.
తయారీరంగం..
లాక్డౌన్ వల్ల చాలా తీవ్రంగా దెబ్బతిన్న రంగం ఇదే. రాకపోకలు నిలిచిపోవడం సప్లై చైన్‌పై ప్రభావం పడింది. గ్లోబల్ వ్యాల్యూ చైన్ దెబ్బతింది. దేశీయ ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఫలితంగా 2021 తొలి త్రైమాసికం(మార్చి-జూన్)లో తయారీ రంగం ఏకంగా 39.3 శాతం క్షీణించింది.
అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కావడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల తయారీ రంగం జూన్‌లో కాస్త కోలుకుంది. ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు ఈ రంగం నిలదొక్కుకునేందుకు ఉపయోగపడ్డాయి.
ఈ చర్యలతో మూడు నెలలు తిరిగేసరికి తయారీ రంగం 'ప్రతికూలం' నుంచి బయటపడింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 0.6 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఈ రంగం మరింత పుంజుకునే అవకాశం ఉంది. ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని 10 కీలక పరిశ్రమలకు వర్తింపజేయడం, వోకల్ ఫర్ లోకల్ ప్రచారం ఈ రంగానికి ఉత్తేజం కలిగించే అంశాలుగా ఉండనున్నాయి.
వ్యవసాయం..
లాక్డౌన్లో ఉత్పత్తి నిలిచిపోయి, ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయి, కీలక రంగాలన్నీ నేలచూపులు చూసిన వేళ దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకుంది వ్యవసాయ రంగమే. అద్భుతమైన పనితీరుతో జీడీపీ వృద్ధిరేటు మరింత పడిపోకుండా వ్యవసాయ రంగం తోడ్పడింది. సంక్షోభంలో ఆశాకిరణంలా నిలిచింది. తయారీ రంగం చతికిల పడ్డ తొలి త్రైమాసికంలో 3.4 శాతం వృద్ధి నమోదు చేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలోనూ అదే వృద్ధిరేటును రికార్డు చేసి ఆర్థిక వ్యవస్థకు ఆసరాగా నిలిచింది.