తెలంగాణ

telangana

ETV Bharat / business

'వచ్చే ఏడాది భారత వృద్ధిరేటు 5.1 శాతమే' - భారత జీడీపీ

కరోనా వైరస్​ ప్రభావంతో భారత జీడీపీ వృద్ధి రేటు క్షీణిస్తుందని పారిస్​ ఆధారిత ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) నివేదించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును 5.1 శాతంగా అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా జీ-20 దేశాల్లో వృద్ధి రేటు పడిపోతుందని తెలిపింది.

gdp
జీడీపీ

By

Published : Mar 3, 2020, 12:18 PM IST

కరోనా వైరస్​ భారత జీడీపీ వృద్ధిరేటుపై ప్రభావం చూపిస్తుందని అంతర్జాతీయ అధ్యయన సంస్థ నివేదించింది. 2020 ఆర్థిక సంవత్సరానికి తొలుత 6.2 శాతంగా అంచనా వేసిన వృద్ధి రేటు 5.1 శాతానికి కుదించింది.

జీ-20 దేశాల్లో మందగమనం..

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక విపణులు, పర్యటకం, రవాణా రంగాలపై వైరస్​ వ్యాప్తి ప్రభావం పడిందని ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) వెల్లడించింది. ప్రపంచ సరఫరా వ్యవస్థ ధ్వంసమైందని తెలిపింది. ఫలితంగా జీ-20 ముఖ్యంగా చైనాతో వాణిజ్య సంబంధాలున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రమాదంలో ఉన్నాయని స్పష్టం చేసింది.

అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల కూటమి 'జీ-20'లో భారత్​ కూడా భాగమే. ఓఈసీడీ నివేదిక ఆధారంగా.. వచ్చే ఏడాది భారత్​ వాస్తవ జీడీపీ అంచనా 5.1 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఆ తర్వాత 5.6 శాతం వృద్ధి రేటు నమోదు అవుతుందని తెలిపింది. 2019 నవంబర్​లో వేసిన అంచనాలతో పోలిస్తే ఇది 1.1 శాతం తక్కువ.

ఈ ఏడాది 4.9 శాతమే..

కేంద్ర బడ్జెట్​ సమావేశాల్లో ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వే ప్రకారం.. వచ్చే ఏడాది 6-6.5 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా ప్రస్తుత ఏడాది జీడీపీ రేటు 5 శాతంగా ఉంటుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్​ఎస్​ఓ) వెల్లడించింది. అయితే ఈ ఏడాది రేటు 4.9 శాతమేనని ఓఈసీడీ నివేదించింది.

ఇప్పటికే కరోనా వైరస్​ కారణంగా చాలామంది మరణించారని.. భారీ ఆర్థిక విధ్వంసం జరుగుతోందని ఓఈసీడీ స్పష్టం చేసింది. ప్రపంచ సరఫరా వ్యవస్థ, ప్రయాణ, వస్తు విపణుల్లో చైనా కీలకంగా ఉండటమే ప్రస్తుత మందగమనానికి కారణమని వివరించింది.

ఇదీ చూడండి:'2008 ఆర్థిక మాంద్యం స్థాయిలో కరోనా ప్రభావం'

ABOUT THE AUTHOR

...view details