కరోనా సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనుకున్నదాని కంటే వేగంగా పుంజుకుంటోందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) తెలిపింది. కరోనా టీకా ప్రయోగాలు విజయవంతం కావడం, అమెరికా ఉద్దీపనలు ఇందుకు దోహదం చేశాయని పేర్కొంది. అయితే నిరుద్యోగ సమస్య మాత్రం ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉందని ఓఈసీడీ అభిప్రాయపడింది.
ప్రపంచ వృద్ధి రేటు ప్రస్తుత సంవత్సరానికి 5.5 శాతంగాను, వచ్చే సంవత్సరానికి 4 శాతంగాను అంచనా వేసింది ఓఈసీడీ. ఈ సంస్థ గత డిసెంబరులో వేసిన అంచనాల ప్రకారం.. 2021 వృద్ధిరేటు 4.2 శాతం, 2022కి 3.7 శాతం కంటే తాజా అంచనాలు మెరుగవ్వడం గమనార్హం. ఈ ఏడాది మధ్య కల్లా కరోనా ముందునాటి స్థాయులకు మించి ప్రపంచ ఉత్పత్తి నమోదవుతుందని ఓఈసీడీ భావిస్తోంది.