దేశంలో అపరకుబేరుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 2019-20లో భారత్‌లో 141 మంది బిలియనీర్లు ఉండగా.. 2020-21లో ఆ సంఖ్య 136కు తగ్గింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు సమయంలో రూ.100కోట్లకు పైగా ఆదాయాన్ని వెల్లడించిన వ్యక్తులను ఈ జాబితాలో చేరుస్తారు. 2018-19లో 77 మంది బిలియనీర్లు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు రెట్టింపునకు చేరుకోవడం గమనార్హం. ఇక 2016 నుంచి సంపద పన్నును రద్దు చేసిన నేపథ్యంలో.. ఆ కుబేరుల పూర్తి సంపద వివరాలు సీబీడీటీ వద్ద లేవని కేంద్రమంత్రి తెలిపారు.
ధరల కట్టడికి చర్యలు..
ఇక నిత్యావసరాల ధరలకు సంబంధించిన మరో ప్రశ్నకు నిర్మలా సీతారామన్ బదులిస్తూ.. 'దేశంలో ధరల పరిస్థితులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. ధరల స్థిరీకరణ కోసం తగిన చర్యలు చేపడుతున్నాం' అని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం కోసం వంటనూనెలపై దిగుమతి సుంకాలను తగ్గించినట్లు చెప్పారు. పప్పు ధాన్యాల నిల్వలపై పరిమితి విధించినట్లు పేర్కొన్నారు.
1.33లక్షల మందికి హామీ లేని రుణాలు