తెలంగాణ

telangana

ETV Bharat / business

'6 నెలల్లో రూ.1.13 లక్షల కోట్ల బ్యాంకు మోసాలు' - మొండి బకాయిలు

ప్రభుత్వ రంగ బ్యాంకుల మోసాలు, నిరర్ధక ఆస్తులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. సర్కారు తీసుకున్న చర్యలు, సంస్కరణలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో రూ.1,13,374 కోట్ల బ్యాంకు మోసాలు గుర్తించినట్లు తెలిపింది. 2018 మార్చి 31 నాటికి రూ.8,97,601 కోట్లుగా ఉన్న ఎన్​పీఏలు.. 2019 సెప్టెంబర్​ నాటికి రూ.7,27,296 కోట్లకు తగ్గినట్లు వెల్లడించింది.

npa
ఎన్​పీఏలు

By

Published : Feb 3, 2020, 4:56 PM IST

Updated : Feb 29, 2020, 12:48 AM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో బ్యాంకులు, గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థల్లో రూ.1,13,374 కోట్ల మోసాలు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ మేరకు లోక్‌సభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు మంత్రి.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలను నిర్ణీత సమయంలో గుర్తించడం, దర్యాప్తు కోసం 2015లో కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. ఈ కార్యాచరణ ద్వారా నిర్మాణాత్మక, క్రమమైన సంస్కరణలను అమలు చేసినట్లు తెలిపారు. తాము అమలు చేస్తున్న విధానాల వల్ల ఎక్కువ మోసాలు బయటపడ్డాయని వెల్లడించారు.

గత ఆర్థిక సంవత్సరం(2018-19)లో రూ.71,543 కోట్ల మోసాలు బయటపడగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆర్ధభాగంలోనే అంతకు మించిన మోసాలు బయటపడినట్లు సీతారామన్​ తెలిపారు.

ఎన్​పీఏలూ తగ్గాయ్​..

ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు(ఎన్​పీఏలు) 2019 సెప్టెంబర్ 30 నాటికి రూ.7.27 లక్షల కోట్లకు తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. లోక్​సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎన్​పీఏలపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ వివరణ ఇచ్చారు.

2018 మార్చి వరకు ఇలా..

రిజర్వు బ్యాంక్​ డేటా ప్రకారం నిరర్ధక ఆస్తులు, స్థూల​ ఎన్​పీఏలు 2015 మార్చి 31 నాటికి రూ.2,79,016 కోట్లుగా ఉండగా.. 2017 మార్చి 31 నాటికి రూ.6,84,732 కోట్లు.. 2018 మార్చి 31 నాటికి రూ.8,97,601 కోట్లకు పెరిగినట్లు ఠాకూర్​ తెలిపారు.

తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో ఎన్​పీఏలు 2019 సెప్టెంబర్​ 30 నాటికి రూ.7,27,266 కోట్లకు తగ్గినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:హ్యుందాయ్​ రెండోతరం 'క్రెటా' వచ్చేది అప్పుడే!

Last Updated : Feb 29, 2020, 12:48 AM IST

ABOUT THE AUTHOR

...view details