తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక మాంద్యమా? అదెక్కడ?... విపక్షానికి కేంద్రం ప్రశ్న - భారత్​లో ఆర్థిక మాంద్యం లేదని లోక్​సభ వేదికగా స్పష్టంచేసింది కేంద్రం

భారత్​లో ఆర్థిక మాంద్యం లేదని లోక్​సభ వేదికగా స్పష్టంచేసింది కేంద్రం. వృద్ధిరేటు 5 శాతానికి క్షీణించిందన్న వాదనల్ని తోసిపుచ్చింది.

ఆర్థిక మాంద్యమా? అదెక్కడ?... విపక్షానికి కేంద్రం ప్రశ్న

By

Published : Nov 18, 2019, 5:53 PM IST

ఆర్థిక మాంద్యమా? అదెక్కడ?... విపక్షానికి కేంద్రం ప్రశ్న
భారత్​లో ఆర్థిక మందగమనం లేదని, ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న వ్యవస్థగా కొనసాగుతోందని స్పష్టంచేశారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్. జీడీపీ వృద్ధి 5 శాతానికి క్షీణించిందన్న వాదనల్ని ఆయన లోక్​సభలో తోసిపుచ్చారు.

ప్రశ్నోత్తరాల సమయంలో...

భారత్​కు పెట్టుబడుల రాకపై లోక్​సభలో అడిగిన ఓ ప్రశ్నకు జవాబు ఇచ్చారు అనురాగ్. 2025 నాటికి భారత్​ 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

"గత ఐదేళ్ల పరిస్థితి చూస్తే​ ప్రపంచంలో వేగంగా దూసుకెళ్తున్న ఆర్థిక వ్యవస్థలలో భారత్​ ఒకటిగా ఉంది. 2014 నుంచి 2019 వరకు ఆర్థిక వృద్ధి రేటు 7.5 శాతం నమోదవుతూ వస్తోంది. కాబట్టి ఈ రోజుకీ.. మన ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ఉంటుంది."
- అనురాగ్​ ఠాకూర్, కేంద్ర మంత్రి

ఉందంటే లేదంటారు

అనురాగ్​ సమాధానంపై ఆమ్​ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్​ అభ్యంతరం తెలిపారు.

"వృద్ధిరేటు 5 శాతానికి పడిపోయింది కాబట్టి దేశం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతోంది. కానీ ప్రభుత్వం వేరేలా చెబుతోంది. ఆర్​బీఐ డైరక్టర్​ కూడా వ్యాపార వర్గాల్లో నమ్మకం సన్నగిల్లిందని చెప్పారు. మరి దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిందని ఒప్పుకోవడానికి సర్కారు సిద్ధంగా ఉందా? ఎందుకంటే.. ప్రభుత్వం ఒకలా చెబుతుంటే, వాస్తవం వేరేలా ఉంది. "
-భగవంత్​ మాన్​, ఆప్​ ఎంపీ

భగవంత్​ వ్యాఖ్యల్ని అనురాగ్​ తోసిపుచ్చారు.

"వృద్ధి రేటు 5 శాతానికి క్షీణించలేదు. బహుశా ఆయన అభివృద్ధి తగ్గిందని చెప్పాలనుకుంటున్నారేమో. అయినా ఈ పతనం గురించి ఏ ఆర్​బీఐ గవర్నర్​ చెప్పారో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను."
- అనురాగ్​ ఠాకూర్, కేంద్ర మంత్రి

బ్యాంకుల విలీనం, పరిశ్రమలకు పన్ను రాయితీలు వంటి సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ మరింత పరిపుష్ఠం అవుతుందని చెప్పారు అనురాగ్​.

ఇదీ చదవండి:నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details