ఆత్మ నిర్భర్ భారత్ పథకం అమలుపై.. వివిధ శాఖల కార్యదర్శులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన మూడు రోజుల సమీక్ష ఆదివారం ముగిసింది. ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ప్రకటించిన మూడు పథకాలను ఇప్పటికే సంబంధిత శాఖలు, విభాగాలు అమలు చేస్తున్నట్లు సమీక్ష తర్వాత ఆర్థిక శాఖ తెలిపింది. ఆయా పథకాల అమలు పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది.
పథకం అమలు ఇలా..
ఆత్మ నిర్భర్ భారత్లో భాగమైన అత్యవసర రుణ గ్యారెంటీ పథకం ద్వారా డిసెంబర్ 4 నాటికి.. 80,93,491 ఎంఎస్ఎంఈలకు రూ.2,05,563 కోట్ల రుణాలను బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మంజూరు చేసినట్లు తెలిపింది ఆర్థిక శాఖ. అందులో 40,49,489 ఎంఎస్ఎంఈలకు రూ.1,58,626 కోట్ల రుణాలను ఇప్పటికే అందించినట్లు వివరించింది.