చెక్ పేమెంట్ మోసాలను అరికట్టేందుకు 'పాజిటివ్ పే' అనే నూతన విధానాన్ని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తీసుకువచ్చింది. ఈ సరికొత్త విధానం 2021 జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. ఈ పద్దతి అమలులోకి వస్తే.. చెక్కుల ద్వారా మరింత సురక్షితంగా లావాదేవీలు నిర్వహించవచ్చని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
సాధారణంగా చెక్, దానిపై ఉన్న ఖాతాదారుని సంతకం నిజమైనవి అయితే.. బ్యాంకులు చెక్ మంజూరు చేస్తున్నాయి. కానీ మోసగాళ్ళు చెక్ వివరాలను మార్చి మోసాలకు పాల్పడుతున్నారని ఐఎఫ్ఎస్ ఇండియా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా చీఫ్ రిస్క్ ఆఫీసర్ భరత్ పంచల్ తెలిపారు.
ఆ చెక్కులకు తప్పనిసరి..
ఆర్‌బీఐ నోటిఫికేషన్ ప్రకారం రూ.50 వేలు అంతకంటే ఎక్కువ మొత్తంలో జారీ చేసిన చెక్కులను పునర్సమీక్షించాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని బ్యాంకులు తప్పనిసరిగా అమలు చేయవచ్చు, లేదా వినియోగదారుని అభీష్టం మేరకు వదిలివేయవచ్చు. అయితే, రూ. 5 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం గల చెక్కుల విషయంలో తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ పాజిటివ్ పే సదుపాయాన్ని నేషనల్ పేమెంట్ కార్ప్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) అభివృద్ధి చేస్తోంది.
ఎలా పనిచేస్తుంది?
వినియోగదారులు తాము ఇచ్చే చెక్కుల వివరాలను బ్యాంకుతో పంచుకోవాలి. చెల్లింపులు చేసే ముందు చెక్కులో పొందుపరచిన వివరాలను వినియోగదారుడు తెలిపిన వివరాలతో పోల్చి చూస్తాయి. వివరాలు సరిపోలితే చెక్కును మంజూరు చేస్తాయి.
నోటిఫికేషన్ ప్రకారం, చెక్కు ఇచ్చే వారు ఎలక్ట్రానిక్ పద్ధతిలో(ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, ఏటీఎం వంటివి) వివరాలను తెలియ పరచవచ్చని ఆర్‌బీఐ వివరించింది. ఐడీబీఐ వంటి బ్యాంకులు ఖాతాదారులను ప్రోత్సహించేందుకు ఇప్పటికే ఈ పద్ధతిని ప్రారంభించాయి. ఖాతాదారులు ఐడీబీఐ బ్యాంక్ గో మొబైల్+యాప్ ద్వారా వివరాలను అప్‌డేట్ చేసే సదుపాయాన్ని కల్పించినట్లు ఐడీబీఐ బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది.
వినియోగదారుడు చెక్ జారీ చేసిన వ్యక్తి లేదా సంస్థ పేరు, నగదు విలువ, చెక్ నంబరు, జారీ చేసిన తేదీ వంటి వివరాలను నమోదు చేయాలి.
పైన తెలిపిన వివరాలను వినియోగదారుడు బ్యాంకుకు తెలిపిన తర్వాత, బ్యాంకులు ఈ డేటాను కేంద్రీకృత (సెంట్రలైజ్) డేటా సిస్టమ్‌లో అప్‌లోడ్ చేస్తాయి. చెక్కును స్వీకరించిన తరువాత, బ్యాంక్ కేంద్ర డేటా బేస్ నుంచి వివరాలను ధృవీకరిస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా బ్యాంకులు చెక్కును రెండు సార్లు పరిశీలిస్తాయి. ఒకసారి సంతకాన్ని సరిపోల్చితే, అందులోని వివరాలతో మరోసారి ధృవీకరిస్తుంది.
చెక్‌లలో ఇప్పటికే వాటర్‌మార్క్, లోగో, పాంటోగ్రాఫిక్ ఇమేజ్, సీరియల్ నంబరు, అకౌంట్ నంబరు, సాధారణ లైట్‌కి కనిపించని భద్రత ఫీచర్లు ఉండనే ఉన్నాయి.
ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశ్యం చెక్ మోసాలను నిలువరించడం. పాజిటివ్ పే వినియోగదారులకు బీమాగా పనిచేస్తుంది. ఒకవేళ ఖాతాదారుడు చెక్కు జారీ చేసిన తరువాత, సంబంధిత వివరాలను బ్యాంకుతో పంచుకున్నప్పటికి, మోసపూరిత చెక్కులను బ్యాంక్ మంజూరు చేస్తే, దాని పూర్తి భాద్యత బ్యాంకుపై ఉంటుందని పంచల్ తెలిపారు.
చెక్కు ద్వారా మోసపూరిత లావాదేవీలు జరిగితే దానికి కారణం బ్యాంకు\వినియోగదారుడు కావచ్చు. సాధారణంగా బ్యాంకులు బాధ్యత తీసుకోవు. అది ఖాతాదారుడు నిర్లక్ష్యంగానే బ్యాంకులు చూపిస్తాయి. అందువల్ల వినియోగదారులు బ్యాంకింగ్ మోసాలకు గురికాకుండా ఆర్‌బీఐ కల్పిస్తున్న ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడం మంచిది.
ఇదీ చూడండి:'2020-21లో జీడీపీ క్షీణత 7.4 శాతమే'