భారత్‌లో నవకల్పనలకు కొరతేమీ లేదు. ఈ విషయంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు రెండింటిదీ ఆశాజనక ప్రస్థానమే. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే మాత్రం మనదేశం కొంత వెనకబడే ఉంది. ప్రపంచ నవీకరణల్లో వివిధ దేశాల ప్రభావంపై అమెరికా మేధాసంస్థ ‘ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఐటీఐఎఫ్)’ ఇటీవల ఓ అధ్యయనం చేపట్టింది. దాని ప్రకారం మొత్తం 56 దేశాల జాబితాలో భారత్ దాదాపు అట్టడుగున నిలిచింది. దేశంలోని మేధా సంపత్తి చట్టాలు, ఎగుమతి రాయితీలు, సేవారంగంలోని మార్కెట్ల వంటివి ఈ పరిణామానికి కారణమని తెలుస్తోంది. మానవ మూలధనాన్ని అభివృద్ధి చేసే విషయంలో పేలవ పనితీరు కూడా ర్యాంకుల్లో వెనకబాటుకు కారణమైనట్లు ఐటీఐఎఫ్ ఉపసూచీల అధ్యయనం స్పష్టీకరిస్తోంది.
విద్యరంగ వ్యయంలో భారత్ స్థానం
ప్రాథమిక, మాధ్యమిక స్థాయి విద్యలో ఒక్కో విద్యార్థిపై దేశం పెడుతున్న సగటు ఖర్చులోనూ భారత్ అట్టడుగున ఉంది. ఒక్కో విద్యార్థిపై కేవలం రూ.88,600 వ్యయీకరిస్తూ- కొలంబియా, వియత్నాం వంటి దేశాలకన్నా వెనకంజ వేసింది. ఉన్నత విద్య పరంగానూ మనదేశ పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. విశ్వవిద్యాలయ పరిశోధనలపై తలసరిన ప్రభుత్వం అందజేస్తున్న నిధులూ అంతంతమాత్రమే. ఇక్కడా భారత్‌ది చివరిస్థానమే. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి దేశాలు మనకన్నా మెరుగ్గా ఉన్నాయి. ఉన్నత విద్యలో పెట్టుబడులు తక్కువగా పెడుతున్నారంటే, పరిశోధనల పరంగా భారత్ కృషి అంతంతమాత్రంగా ఉన్నట్లుగా భావించాలి. ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగుల్లో వర్సిటీలు చేపట్టిన నాణ్యమైన పరిశోధనల్నే పరిగణనలోకి తీసుకున్నారు. దేశంలోని చాలా వర్సిటీలు పరిశోధనలపై దృష్టి సారించడం లేదు. దీనివల్ల అంతర్జాతీయ ర్యాంకుల్లో అవి బోధన దుకాణాల స్థాయికి దిగజారిపోతున్నాయి. ఐటీఐఎఫ్ నివేదిక ప్రకారం- ఒక దేశంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల సంఖ్యాపరంగా, 51 దేశాల జాబితాలో భారత్ 35వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి 800 వర్సిటీల్లో 17 మాత్రమే భారత్‌లో ఉండటం ఇందుకు కారణమనేది సుస్పష్టం.
అవకాశాలు అపారం
భారత వర్సిటీల్లో మెరుగైన పరిశోధన సౌకర్యాలు లేకపోవచ్చు. అదేసమయంలో ఐఐఎస్‌సీ, డీఆర్‌డీవో, ఇస్రో వంటి ప్రసిద్ధి చెందిన పరిశోధన సంస్థలు దేశంలో ఉన్నాయి. పరిశోధన-అభివృద్ధిపై ప్రభుత్వం తలసరిన చేసే వ్యయంలోనూ భారత్ ర్యాంకు మధ్యస్తంగా ఉంది. రూ.32,900 తలసరి వ్యయంతో మనదేశం కెన్యా, దక్షిణాఫ్రికాలకన్నా వెనగ్గా ఉంది. ప్రతి లక్షమందికి కేవలం 15 మంది పరిశోధకులే ఉన్నారు. ఫలితంగా ఈ ప్రమాణంలో భారత్ అట్టడుగున ఉన్న అయిదు దేశాల సరసన ఉంది. పరిశోధనల నాణ్యతలోనూ భారత్ పరిస్థితి ఇదే. ‘సైటేషన్ల’ సంఖ్యలోనూ భారత్ అడుగునున్న ఆరుదేశాల సరసన నిలిచింది. వర్సిటీ ప్రయోగశాలల్లో జరిగే పరిశోధనలను వాణిజ్యపరంగా ప్రైవేటు రంగానికి చేర్చే దిశగా తోడ్పడే సాంకేతికత బదిలీకి మనదేశంలో చట్టపరమైన వెసులుబాటు లేదు. అభివృద్ధి చెందిన దేశాలే కాకుండా, దక్షిణాఫ్రికా, ఇండోనేసియా, బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలూ ఈ తరహా చట్టపర సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. దీనివల్ల లైసెన్సులు, ఆర్థికంగా లాభదాయక నవకల్పనల్ని వాణిజ్య మార్కెట్‌కు తరలించడం తేలికవుతుంది. నవకల్పనలకు ప్రోత్సాహం కల్పించాలనే విధానాన్ని పాటించే ఏ దేశమైనా, ప్రపంచవ్యాప్తంగా వాటిని పెంపొందించేందుకు కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో నవకల్పనల్ని ప్రోత్సహించేందుకు చేపట్టిన ‘స్టార్టప్ ఇండియా’ వంటి కార్యక్రమాలు స్వల్పకాలంలో ప్రేరణ అందించేవే. అంకుర పరిశ్రమల్లో పెట్టే పన్నుచెల్లింపుదారుల సొమ్ము స్వల్పకాలంలోనే ఉద్యోగాలు కల్పించే దిశగా తోడ్పడుతుందనడలో సందేహం లేదు. నవకల్పనల్ని ప్రోత్సహించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లయితే మున్ముందుగా ఉన్నత విద్యలో పెట్టుబడులకు ప్రాధాన్యమివ్వాలి. నవకల్పనల్లో దేశం వెనకబాటుకు అసలు కారణం ప్రాథమిక, మాధ్యమిక విద్యపై అత్యంత తక్కువ నిధుల్ని మనదేశం వ్యయం చేయడమే!
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే!
ప్రైవేటు రంగం సాయంతో జీడీపీలో పరిశోధన- అభివృద్ధిపై వ్యయాల్ని రెండు శాతానికి పెంచాలనే లక్ష్యంతో పలు విజ్ఞానశాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన, నవకల్పనల విధానాల్ని ప్రకటించినా అవేవీ ఆచరణకు నోచుకోలేదు. విశ్వ నవకల్పనల సూచీ (జీఐఐ) ప్రకారం, వాణిజ్యపరమైన పరిశోధన-అభివృద్ధి విభాగంలో భారత్ 2013లో 42వ స్థానంలో ఉండగా, 2019నాటికి 49వ స్థానానికి దిగజారింది. స్థూల ఆర్‌అండ్‌డీ వ్యయాల్లో ప్రైవేటురంగం ఖర్చు సగానికన్నా తక్కువగానే ఉంది. జీఐఐలో మంచి పనితీరు కనబరుస్తున్న ఇతర దేశాలతో పోలిస్తే, ఇది తక్కువే. ఈ రంగంలో దీటుగా రాణించాలంటే ముందుగా నవకల్పనలపై జాతీయ స్థాయిలో ఒక దార్శనిక ప్రణాళికను రూపొందించుకోవాలి. ప్రభుత్వం, ప్రైవేటురంగం, విద్యాసంస్థల మధ్య విజయవంతమైన సహకారం నెలకొన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. విజయవంతమైన నవకల్పనల గమ్యస్థానాలుగా తమను తాము తీర్చిదిద్దుకున్న ఫిన్లాండ్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు సమష్టి జాతీయ దార్శనిక ప్రణాళిక, వ్యూహం కీలకమని రుజువు చేశాయి. జాతీయ స్థాయిలో దార్శనిక ప్రణాళికలు లేకుండానే భారత ఐటీ రంగంలో ప్రాథమికంగా నవకల్పనలు ప్రాణం పోసుకున్నాయి. ప్రస్తుత కాలంలో ఇది అంత సరైన వ్యూహం కాదు. ఈ క్రమంలో నీతిఆయోగ్ అటల్ నవకల్పనల మిషన్‌కు రూపకల్పన చేయడం బాగానే ఉన్నా, నవకల్పనల కోసం ఒక జాతీయ స్థాయి సమన్వయ వ్యూహం రూపుదిద్దుకొనకపోవడం బాధాకరం. ఏ సంస్థలకు, రంగాలకు సహాయ సహకారాలు అందించాలనే దానిపై నిర్ణయాన్ని ‘ప్రైవేట్ వెంచర్ క్యాపిటల్’ సంస్థల విచక్షణకు విడిచిపెట్టడం భారత్‌కు సంబంధించి ఉత్తమ విధానం కాదు. నవకల్పనలు సాధించాల్సిన రంగాల్ని, సమస్యలకు పరిష్కారం గుర్తించే విషయంలో ప్రభుత్వం- పరిశ్రమలు, విద్యావేత్తల భాగస్వామ్య సహకారాలను తీసుకోవాలి. ప్రభుత్వం ఆరోగ్యం నుంచి పారిశుద్ధ్యం వరకు, రవాణా నుంచి పర్యావరణం వరకు విభిన్న రంగాలపై నవకల్పనల కోసం దృష్టి సారించాల్సి ఉంది. కొన్ని నిర్దిష్ట రంగాల్ని ఎంచుకొని వనరుల్ని సేకరించి, విజ్ఞాన బదిలీని జరపడం ద్వారా విజయం ఎలా సాధించవచ్చో చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు ప్రపంచానికి చూపాయి. ఇదంతా చేయడం అంత తేలికైన పనేమీ కాదు. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చే కొత్త సాంకేతిక పరిజ్ఞానాల్ని అందిపుచ్చుకొంటూ, నవకల్పనల దిశగా సాగే విషయంలో పరిస్థితి మరింత మెరుగుపడాలి. ఇందుకోసం విశ్వవిద్యాలయాల్లో మేధాసంపత్తిపై పెట్టుబడులు పెంచాలి. అగ్రశ్రేణి సంస్థల భాగస్వామ్యంతో చక్కని నవకల్పనల వాతావరణాన్నీ రూపొందించాలి.
ప్రోత్సాహకాలు అవసరం
వ్యాపార నిర్వహణ, నవకల్పనలకు ఒకదానికొకటి సంబంధం ఉన్నా, రెండూ ఒకటి కాదన్న సంగతి గుర్తించడం ముఖ్యం. వ్యాపారవేత్తలందరికీ నవకల్పనల్లో ఆసక్తి ఉండదు. ఉద్యోగ కల్పన, స్వయంఉపాధిని ప్రోత్సహించేందుకు వ్యాపార నిర్వహణను ప్రోత్సహించడం ముఖ్యమన్న సంగతి తెలిసిందే, ఈ క్రమంలో గణనీయమైన నవకల్పనలు ప్రస్తుతం ఉండే కంపెనీల్లోనే జరుగుతాయన్న సంగతి అందరూ గుర్తుంచుకోవాలి. ఆర్థిక వ్యవస్థలోని ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో నవకల్పనల్ని ప్రోత్సహించడం ముఖ్యం. ముఖ్యంగా ఆయా కంపెనీలు ప్రపంచస్థాయిలో పోటీ పడటానిరి ఇదెంతో అవసరం. సులభతర వాణిజ్యం అంశంలో ప్రపంచబ్యాంకు ర్యాంకుల్లో భారత్ పనితీరు పేలవం. వ్యాపార వ్యవహారాల్ని సరళతరంగా మార్చడంలో భాగంగా, ఈ సమస్యను సరిదిద్దే విషయంలో దృఢసంకల్పంతో వ్యవహరించాలి. పరిశోధన-అభివృద్ధి విభాగాలపై పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అగ్రస్థాయి పరిశోధక విశ్వవిద్యాలయాలతో ఒప్పందాల్ని చేసుకునే సంస్థల్ని ప్రోత్సహించాలి. ప్రైవేట్, ప్రభుత్వరంగ సంస్థలు నవకల్పనలకు వ్యూహాత్మక ప్రాధాన్యం ఇచ్చేలా స్థిరమైన ప్రయత్నాలు సాగాలి. చివరగా డిజిటల్ పరివర్తన, నవకల్పనలకు ప్రభుత్వం తనకు తానే ఒక ఉదాహరణలా నిలవాలి. ప్రభుత్వ సేవలు గ్రామాల నుంచి నగరాల వరకు కోట్లమందికి చేరతాయి. డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకోవడం, రీడిజైన్ ప్రక్రియల ద్వారా ప్రభుత్వం ఖర్చుల్ని తగ్గించుకోవడం, కీలకమైన వృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టే సామర్థ్యాల్ని పెంపొందింపజేయడం వంటి అంశాల ద్వారా ప్రభుత్వం భారతీయులందరి జీవన నాణ్యతను మెరుగుపరచవచ్చు. మనమిప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవ దశలో ఉన్నాం. ఆర్థికవ్యవస్థలోని అన్ని రంగాలు, అందరి జీవితాలు రాబోయే సంవత్సరాల్లో గణనీయ రీతిలో మార్పు చెందేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ విషయంలో భారత్‌కూ ప్రత్యేక అవకాశాలున్నాయి.
పరిమితుల చట్రంలో ప్రతిభ
ఒకట్రెండు దశాబ్దాల్లో భారత విజ్ఞానశాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగం పలురెట్లు విస్తరించింది. దేశంలో పెద్దసంఖ్యలో శాస్త్రవేత్తలు ఉద్భవించారు. అయినా స్వాతంత్య్రం వచ్చాక విజ్ఞానశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని భారత్ సాధించలేకపోయింది. అంతటి స్థాయిగల ‘ఊల్ఫ్ ప్రైజ్’నూ ఏ భారతీయుడూ సాధించలేకపోయారు. ‘మిలీనియం టెక్నాలజీ ప్రైజ్’ సైతం ఒక్కరికీ రాలేదు. ప్రపంచంలోని అగ్రశ్రేణి 200 విద్యాసంస్థల్లో భారత్‌కు చోటే దక్కలేదు. అమెరికాలో చాలా వర్సిటీలకు విరాళాల ద్వారా నిధులు సమకూరుతాయి. మనదేశంలో ఈ ప్రక్రియ శైశవదశలోనే ఉంది. దశాబ్దం క్రితం దాకా భారత విజ్ఞానశాస్త్ర విద్యా సంస్థలకు నిధుల కేటాయింపు చాలా తక్కువే. కొన్నేళ్లుగా పరిస్థితిలో మార్పు వచ్చింది. దేశ విద్యాసంస్థల్లో ప్రతిభను గుర్తించే వ్యవస్థలు సాంకేతికత అభివృద్ధికన్నా శాస్త్ర అంశాల ప్రచురణలపైనే ఎక్కువగా దృష్టి సారించాయి. ఇలాంటి పరిమితులవల్ల భారత శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన గణనీయ విజయాలు విస్మరణకు గురయ్యాయనేది కొంతమంది సీనియర్ శాస్త్రవేత్తల భావన. నవకల్పనల వైపు యువతను నడిపించడంలో అనువైన పరిస్థితులు దేశంలో లేవన్నది చేదునిజం.
-పీవీ రావు రచయిత-ఆర్థిక, సామాజిక విశ్లేషకులు