దశాబ్దం కిందట దూకుడుగా రుణాలు ఇవ్వటం వల్ల బ్యాంకింగ్ రంగం తీవ్రంగా కుదేలైందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక రంగంపై నిర్వహించిన వెబినార్లో ఆయన ప్రసంగించారు. పారదర్శక రహిత రుణ వితరణ నుంచి దేశాన్ని బయటకు తీసుకురావడానికి తమ ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
సరైన ఉద్దేశంతో తీసుకున్న వ్యాపార నిర్ణయాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు. కార్పొరేట్ కంపెనీల మొండి బకాయిల వసూలుకు కఠిన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో అన్ని వ్యాపారాలు లాభసాటిగా ఉండవనే విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుందని పేర్కొన్నారు.
అవసరమైన చోట ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడమే తమ ఉద్దేశమని మోదీ తెలిపారు. అయితే బ్యాంకింగ్, బీమా విభాగాల్లో మాత్రం ప్రభుత్వ రంగం సమర్థంగా పని చేయాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.