ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత వద్ధి రేటుపై కాస్త సానుకూల అంచనాలను విడుదల చేసింది ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ 'మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్'. కరోనా కారణంగా 2020-21లో భారత్ వృద్ధి రేటు -11.5 శాతంగా నమోదవుతుందని గతంలో వేసిన అంచనాను తాజాగా.. -10.6 శాతానికి సవరించింది.
ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు గత వారం కేంద్రం రూ.2.7 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ తయారీ రంగం, ఉద్యోగ కల్పన, దీర్ఘ కాలిక వృద్ధి వంటి వాటిని ప్రోత్సహిస్తుందని మూడీస్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే వృద్ధి రేటు అంచనాలను సవరించినట్లు పేర్కొంది.