ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ భారత్‌కు మరోసారి షాకిచ్చింది. 2019లో 7.4 శాతం వృద్ధిరేటు నమోదు కావచ్చని.. 2018లో వేసిన అంచనాల్లో మార్పులు చేసింది. తాజా పరిస్థితుల ఆధారంగా వృద్ధిరేటు 5.6 శాతానికి పరిమితం కావచ్చని పేర్కొంది.
"భారత ఆర్థిక మందగమనం అనుకున్న దానికన్నా ఎక్కువ రోజులు ఉండనుంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాటికి బలహీనంగా ఉన్న డిమాండ్‌కు.. సానుకూలతలు పెంచే ప్రభావం లేదు. డిమాండే ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తి." -మూడీస్, రేటింగ్ ఏజెన్సీ
అక్టోబర్‌లోనూ జీడీపీ అంచనా కోత..
ఇప్పటికే అక్టోబర్ 10న భారత ఆర్థిక వృద్ధిరేటు అంచనాను 6.2 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గించింది మూడీస్. భారత ఆర్థిక వ్యవస్థకు 'స్థిరం' నుంచి 'ప్రతికూలం' రేటింగ్‌ను ఇచ్చింది.
ముఖ్యంగా దేశ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఒత్తిడి తీవ్రంగా ఉండటం వృద్ధి రేటుపై ప్రతికూలతలు చూపుతోందని అభిప్రాయపడింది మూడీస్.
ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక వృద్ధిరేటు క్షీణించకుండా పలు చర్యలు ప్రారంభించింది. సెప్టెంబర్‌లో కార్పొరేట్ సుంకాలను 10 శాతం మేర తగ్గించింది. బ్యాంకులకు మూలధనం సమకూర్చడం, ఆటోమొబైల్ పరిశ్రమకు రాయితీలు ఇవ్వడం వంటి ఉద్దీపనలు తీసుకువచ్చింది.
ఇదీ చూడండి: జీఎస్టీ వార్షిక రిటర్నులకు పెరిగిన గడువు..