కరోనా లాక్డౌన్ కారణంగా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. ఈ నేపథ్యంలో భారత వృద్ధి అంచనాలను సవరించింది ఆర్థిక గణాంక సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్. ప్రస్తుత అంచనాల మేరకు 2020లోభారత వృద్ధిరేటు 0.2 శాతం ఉండనుందని అంచనా వేసింది. అయితే 2021లో భారత వృద్ధి 6.2గా ఉంటుందని పేర్కొంది.
"భారత్లో లాక్డౌన్ను 21 రోజుల నుంచి 40 రోజులకు పెంచారు. వ్యవసాయ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఆంక్షలను సడలించారు. కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే పలు ప్రాంతాల్లో సడలింపులకు భారత్ ప్రణాళికలు వేస్తోంది."
- మూడీస్ ప్రకటన
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమించే విధంగా వ్యయం పెరుగుతోందని అంచనా వేసింది మూడీస్. గ్లోబల్ మ్యాక్రో ఔట్లుక్ 2020-21 ఏప్రిల్ పేరుతో విడుదల చేసిన తాజా అంచనాల్లో జీ-20 దేశాల ఆర్థికవృద్ధి 5.8 శాతం మేర తగ్గనుందని పేర్కొంది.