2020లో భారత జీడీపీ వృద్ధి రేటు 2.5 శాతానికే పరిమితం అవుతుందని అంచనా వేసింది ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ 'మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్'. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని.. ఈ మేరకు భారత వృద్ధి కూడా తగ్గిపోనుందని విశ్లేషించింది.
కరోనా ప్రభావానికి ముందు భారత వృద్ధిరేటు 5.3 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది మూడీస్. కరోనా విజృంభణ కారణంగా తన అంచనాలను సవరించింది. అయితే భారత కేంద్రీయ బ్యాంక్ ఆర్బీఐ ఈరోజు ప్రకటించిన కీలక రేట్లలో కోతను పరిగణనలోకి తీసుకోలేదు మూడీస్.
"బ్యాంకింగ్, బ్యాంకింగేతర రంగాల్లో ద్రవ్య పరిమితుల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థలోకి రుణ ప్రవాహం ఇప్పటికే తగ్గింది. ఈ నేపథ్యంలో 2020లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను తగ్గించాం. దీనిని అభివృద్ధి చెందిన దేశాల వృద్ధిలో అమలు చేశాం. అయితే ఆయా దేశాలు అమలు చేయబోయే ఆర్థిక విధానాల ఆధారంగా వృద్ధి నమోదవుతుంది."
-మూడీస్ ప్రకటన