తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకులో.. నగదు వేసినా... తీసినా బాదుడే!

మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వినియోగదారులపై బ్యాంకులు కొత్తరకం బాదుడు మొదలుపెట్టాయి. నగదు డిపాజిట్ చేసినా.. ఉపసంహరించినా ఛార్జీలు వేస్తున్నాయి.

money deposit and withdrawal charges in banks due to corona crisis
బ్యాంకులో.. నగదు వేసినా... తీసినా బాదుడే!

By

Published : Feb 1, 2021, 6:35 AM IST

హైదరాబాద్‌కు చెందిన అక్షిత్‌కు ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో పొదుపు ఖాతా ఉంది. నవంబరులో మూడుసార్లు బ్యాంకులో రూ.10 వేల చొప్పున జమ చేశారు. నాలుగోసారి జమ చేయగా రూ.125 సర్వీసు ఛార్జి విధించారు. నగదు డిపాజిట్‌ మిషన్‌ (సీడీఎం)లో నగదు జమ చేసినా రూ.50 ఛార్జి వేశారు. ఇదేమని అడిగితే బ్యాంకు నిబంధనలు అంతే.. ఫీజు వెనక్కి ఇవ్వడం సాధ్యం కాదని బ్యాంకు అధికారులు బదులిచ్చారు.

ఎల్‌బీనగర్‌కు చెందిన విఘ్నేష్‌ ప్రైవేటు ఉద్యోగి. పంట డబ్బులతో పాటు చీటీ పాడిన రూ.3 లక్షలు తీసుకెళ్లి ప్రైవేటు బ్యాంకులోని పొదుపు ఖాతాలో జమ చేశారు. నెలాఖరున బ్యాంకు అధికారులు ఖాతా నుంచి రూ.1622.50 నగదు నిర్వహణ ఛార్జీల పేరిట తీసుకున్నారు. ఇదేమని బ్యాంకులో అడిగితే నెలకు రూ.2 లక్షలకు మించి డిపాజిట్‌ చేసినందున మొత్తం డిపాజిట్‌లో ప్రతి వెయ్యికి రూ.5 చొప్పున జీఎస్టీతో కలిపి ఫీజు వేశామని బదులిచ్చారు.

కరోనా బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వినియోగదారులపై బ్యాంకులు కొత్తరకం బాదుడు మొదలుపెట్టాయి. బ్యాంకులో నగదు డిపాజిట్‌ చేసినా, ఉపసంహరించినా ఛార్జీల భారం వేస్తున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో నగదు నిర్వహణ భారం పెరిగిందని బ్యాంకులు చెబుతున్నాయి. నవంబరు 1 నుంచి ప్రైవేటు, కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ పద్ధతులను అమలు చేస్తున్నాయి. ఏటీఎం నగదు ఉపసంహరణ, క్యాష్‌ డిపాజిట్‌ మిషన్లలో నగదు వేసినా జేబుకు చిల్లు పడుతోంది. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నెలకు ఐదు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకునే వీలుండేది. ఇప్పుడు వెసులుబాటును మూడింటికి తగ్గించారు.

రూ.వెయ్యికి రూ.2 నుంచి రూ.5

బ్యాంకుల్లో పొదుపు ఖాతాలపై ప్రస్తుతం 2 శాతం వడ్డీ లభిస్తోంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లపై స్వల్ప కాలానికి 3 శాతానికి మించి రావడం లేదు. బ్యాంకులు నగదు డిపాజిట్లపై వసూలు చేస్తున్న ఛార్జీలు అంతకు మూడు రెట్లు ఉంటున్నాయి. ప్రభుత్వ బ్యాంకులు పరిమితి దాటిన తరువాత ప్రతి వెయ్యికి రూ.2 చొప్పున తీసుకుంటున్నాయి. ప్రైవేటు బ్యాంకులు రూ.2 నుంచి 5 రూపాయల వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. దీనిపై జీఎస్టీ అదనం.

‘‘మా బ్యాంకులో 75 శాతం లావాదేవీలు నగదుతో జరుగుతున్నాయి. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ ఛార్జీలు వేస్తున్నాం. ఏటీఎం, నేరుగా ఉపసంహరణలు, నగదు డిపాజిట్లు నెలకు రూ.2 లక్షలు దాటితే ఛార్జీలు వేస్తున్నాం’’ అని దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ బ్యాంకు ఉద్యోగి తెలిపారు. ‘‘ఛార్జీలు వసూలు చేస్తున్న విషయం ఖాతాదారులకు తెలియడం లేదు. నగదు డిపాజిట్‌ చేసేవారికి బ్యాంకు సిబ్బంది వివరాలు చెప్పాలి. ఈ విషయమై ఇప్పటికే బ్యాంకు ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి’’ అని ఏపీ, తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య కార్యదర్శి ఎం.ఎస్‌.కుమార్‌ తెలిపారు. నగదు నిర్వహణ భారం పెరగడంతో బ్యాంకులు తప్పనిసరి పరిస్థితుల్లో అమలు చేస్తున్నట్లు కొందరు బ్యాంకర్లు తెలిపారు. రూ.20 లక్షల నగదు నిర్వహణ పరిమితి ఉన్న బ్యాంకులో రూ.30 లక్షల నగదు డిపాజిట్లు వస్తే మిగతా రూ.10 లక్షల డిపాజిట్లను క్యాష్‌ చెస్ట్‌ల్లోకి తరలించాలి. కరెన్సీ తనిఖీ చేసి చినిగిన నోట్లను ఉపసంహరించాలి. ఇలా ఖర్చులు పెరగడంతో బ్యాంకులు ఛార్జీలు వసూలు చేయాల్సి వస్తోందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details