"హౌడీ మోదీ"... చర్చంతా ఇప్పుడు ఈ సమావేశం గురించే. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8న్నర గంటలకు ప్రారంభం కానుందీ బహిరంగ సభ. టెక్సాస్‌లోని హ్యూస్టన్ వేదిక. అత్యంత అరుదైన రీతిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి వేదిక పంచుకోనున్నారు.
మోదీ-ట్రంప్ సరికొత్త స్నేహగీతంతో భారత్-అమెరికా మధ్య వాణిజ్యం బంధం మరింత బలపడుతుందని రెండు దేశాల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఇందుకు అనుగుణంగా ఇరు దేశాల మధ్య ఉన్న డిమాండ్లు.. కొంత సమస్యగా మారొచ్చు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం అనేది అంత సులువుగా జరగకపోవచ్చు. ఎందుకంటే ఈ ఒప్పందాల ద్వారా వీలైనంత లబ్ధి తమకే చేకూర్చుకోవాలని ఇరు దేశాలు ప్రయత్నిస్తాయి.
సభ తర్వాత చర్చలు...!
మోదీ, ట్రంప్ హ్యూస్టన్‌లో జరిగే 'హౌడీ మోదీ' కార్యక్రమంలో పాల్గొంటారని శ్వేతసౌధం ఇప్పటికే ప్రకటించింది. ఈ కార్యక్రమానికి దాదాపు 50,000 మంది ప్రవాస భారతీయులు హాజరుకానున్నారని అంచనా. ఐరాస సర్వసభ్య సమావేశం కోసం ఈనెల 27వరకు అమెరికాలోనే ఉండనున్నారు మోదీ. 'హౌడీ మోదీ' కార్యక్రమం తర్వాత.. ఏదో ఒక రోజు మోదీ, ట్రంప్ రెండో దఫా చర్చలు జరిపే అవకాశముంది.
రెండో దఫా చర్చలపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే.. భారత్‌తో అమెరికాకు ఉన్న 30 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును తగ్గించుకునే దిశగా అగ్రరాజ్యం ప్రయత్నాలు చేయొచ్చు. 2017-18 గణాంకాల ప్రకారం అమెరికాకు భారత ఎగుమతులు 48 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అదే సమయంలో అమెరిక భారత దిగుమతులు 27 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ఇరు దేశాల మధ్య జరగాల్సిన వాణిజ్య ఒప్పందాలపై తుది కసరత్తు చేస్తున్నట్లు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈవారం మొదట్లో ప్రకటించారు. అయితే వాటికి సంబంధించి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు గోయల్. మోదీ-ట్రంప్ భేటీలోనే వాటిని ప్రకటించే అవకాశముంది.
భేదాభిప్రాయాలు తొలిగేనా....?
అమెరికా రాజకీయాలపై పట్టు సాధించడం సహా స్థానిక ఉద్యోగాలు, వ్యాపారాల రక్షణ కోసం కొన్ని నెలల ముందు భారత్‌పై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా అమెరికా వస్తువులపై విధిస్తున్న అధిక సుంకాలను ఉద్దేశిస్తూ.. భారత్ 'టారిఫ్ కింగ్' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
విమర్శలతో పాటు.. దిగుమతులపై భారత్‌కు ప్రాధాన్యాల సాధారణ హోదాను(జీఎస్పీ) తొలగిస్తూ ట్రంప్ పాలనా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ఈ చర్య కారణంగా ఈ ఏడాది జూన్‌లో ఇరు దేశాల మధ్య వాణిజ్య విభేధాలు తారస్థాయికి చేరాయి.
జీఎస్పీ హోదా ఉన్న దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే కొన్ని వస్తువులపై సుంకాలు ఉండవు. మొత్తం 129 దేశాలకు, 4,800 వస్తువులకు ఈ వెసులుబాటు ఉంది. జీఎస్పీ హోదా రద్దుకాక ముందువరకు ఆ దేశాలన్నింటిలో భారత్ అత్యధిక లబ్ధిదారుగా ఉంది.
అయితే మోదీ-ట్రంప్ భేటీతో భారత్‌కు జీఎస్పీ హోదా పునరుద్ధరణ జరగొచ్చని అంచనాలున్నాయి. జీఎస్పీ హోదా పునరుద్ధరణకు బదులుగా అమెరికా ఎగుమతులైన బాదం, దుస్తులు, పలు ఇతర వస్తువులపై ఉన్న అధిక సుంకాలు తగ్గించమని భారత్‌ను కోరే అవకాశముంది.
2018 తొలినాళ్లలో ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం సుంకాలను పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ఇది వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని భారత్ వాదించింది. అందుకు బదులుగా సమాధానమిచ్చేందుకు 235 మిలియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై సుంకాలు పెంచి అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది భారత్.
ఈ నేపథ్యంలో రెండు దేశాలు అధికారిక చర్చల ద్వారా ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నం చేశాయి. ఆగస్టులో జీ7 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో 40 నిమిషాల పాటు జరిపిన చర్చలతో ఉద్రిక్తతలు కాస్త సద్దుమణిగాయి. ఇందులో అమెరికా నుంచి చమురు సహా పలు దిగుమతులను పెంచుకునేందుకు ప్రతిపాదనలు చేసింది భారత్. అప్పటికే 4 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతుల అంశం ఇరు దేశాల మధ్య చర్చల్లో ఉంది.
కొత్త డిమాండ్లతో..
అయితే తాజా చర్చల్లో కేవలం సుంకాల తగ్గింపును ట్రంప్ అంగీకరించకపోవచ్చు. మరిన్ని డిమాండ్లను తెరపైకి తెచ్చే అవకాశముంది. ముఖ్యంగా అమెరికా డైరీ ఉత్పుత్తులు, వైద్య పరికారాల మార్కెట్‌కు అవకాశాలు పెంచాలని ఒత్తిడి తీసుకురావచ్చు.
సుంకాల విషయంలో సానుకూలంగా స్పందించినప్పటికీ.. డైరీ పరిశ్రమలకు అవకాశం పెంచే డిమాండ్ మోదీకి క్లిష్టమైన అంశంగా మారొచ్చు. ఎందుకంటే భారత్ వ్యాప్తంగా అసంఘటితంగా విస్తరించిన పాడి పరిశ్రమను రక్షించేందుకు అమెరికా డిమాండును మోదీ అంగీకరించకపోవచ్చు. ఇదే కారణంతో దిగుమతి చేసుకునే ఔషధాలు, వైద్య ఉపకరణాలపై ధరలను అదుపు చేస్తూ వస్తోంది భారత్.
ముఖ్యంగా 2016 ఫిబ్రవరిలో గుండె సంబంధిత స్టెంట్లపై, 2017 ఆగస్టులో మోకాలి ఇంప్లాంట్లపై ధరల నియంత్రణకు పూనుకుంది ప్రభుత్వం. ఈ విషయంపై అమెరికా వాణిజ్య ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశముంది.
దేశీయ, అంతర్జాతీయ తయారీదార్లకు ఒకే రకమైన నింబంధనలు అమలు చేస్తామనే హామీతో మోదీ ఈ సమస్యను సులభంగా పరిష్కరించే అవకాశముంది.
త్వరలో జరగనున్న ద్వైపాక్షిక చర్చల్లో భారత్ తీసుకువచ్చిన డేటా స్థానికత అంశం చర్చకు వచ్చే అవకాశముంది. ఈ విషయంపైనా.. మోదీ వెనక్కి తగ్గే అవకాశాలు లేవు. వివిధ డిజిటల్ పేమెంట్ సేవలందించే సంస్థలు వీసా కార్డ్, మాస్టర్ కార్డ్ సహా పేటీఎం, వాట్సాప్, గూగుల్ ఇతర సంస్థలు భారత యూజర్లకు సంబంధించిన సున్నితమైన డేటాను స్థానికంగానే భద్రపరచాలని బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ ఆర్బీఐ నిబంధనలు కఠినతరం చేస్తూ నిబంధనలు తీసుకువచ్చింది. ఈ నిబంధనలపై గూగుల్, వీసా, మాస్టర్ కార్డ్, అమెజాన్ వంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
అయితే.. జాతీయ భద్రత దృష్ట్యా భారత్ ఈ నిబంధనలను సడలించే అవకాశం లేదు. భారతీయ యూజర్ల డాటా విదేశాల్లో భద్ర పరిచేందుకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. ఆ దేశాల్లో ఉన్న డాటాను భారత ప్రభుత్వం నియంత్రించలేదు కాబట్టి ఈ నిబంధన సడలింపు అసాధ్యమేనని చెప్పాలి. భారత్ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండటం వల్ల అంకురాలకూ ప్రోత్సాహం లభిస్తుంది.
ప్రస్తుతం ఏడాదికి అమెరికా నుంచి 4 బిలియన్ డాలర్లు విలువైన ఇంధన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది భారత్. ఈ ఉత్పత్తుల విషయంలో ఇరు దేశాల మధ్య మరింత బలమైన సంబంధాలు ఏర్పరుచుకోవాలని భారత్ చూస్తోంది. ఇదే జరిగితే అమెరికా చేస్తున్న ఒత్తిళ్లు కొంతమేర తగ్గొచ్చు. హ్యూస్టన్‌లో జరిగే చర్చలు భారత్‌కు మరిన్ని అవకాశాలు పెంచొచ్చు.
-పూజా మెహ్రా, ప్రముఖ పాత్రికేయురాలు, ది లాస్ట్ డికేడ్ (2008-2018) పుస్తక రచయిత
ఇదీ చూడండి: వినియోగదారులకు ఇక బ్యాంకులే ఫైన్ కడతాయి!