కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలకు మిలీనియల్స్ నాంది లాంటి వారు. ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో పలు కారణాల వల్ల సాధారణంగా వారి వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో కొన్ని తప్పిదాలు చేస్తుంటారు. వీటి వల్ల యుక్త వయస్సులో పెద్దగా ప్రభావం పడనప్పటికీ.. భవిష్యత్తులో మాత్రం సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నది నిపుణుల మాట.
వ్యక్తిగత ఆర్థిక నిర్వహణకు సంబంధించి మిలీనియల్స్ చేసే సాధారణ తప్పిదాలు ఏమిటి? వాటి వల్ల ఏర్పడే సమస్యలు ఏమటి? అనేది ఇప్పుడు చూద్దాం.
తొందరగా పెట్టుబడి ప్రారంభించకపోవటం..
జీవితంలో తొందరగా పెట్టుబడులు ప్రారంభించటం చాలా ముఖ్యం. దీని ద్వారా ఎక్కువ మొత్తం సంపద సృష్టించుకోవచ్చు.
అయితే మిలీనియల్స్‌కు పెట్టుబడులపై తక్కువ అవగాహన ఉండే అవకాశం ఉందని పలు సర్వేలు తెలుపుతున్నాయి. కానీ సరైన సమయంలో వారు పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే భారీ మొత్తంలో అవసరమైన నిధిని సమకూర్చుకోవచ్చని సర్వేలు అభిప్రాయపడుతున్నాయి. ఎందుకంటే.. పాత తరం వాళ్ల కంటే మిలీనియల్స్‌కు పెట్టుబడి విషయంలో ఎక్కువ సమయం ఉంటుంది. వాళ్లు ఎంత ఎక్కువ కాలం పెట్టుబడులు కొనసాగిస్తే అంత ఎక్కువ నిధిని సమకూర్చుకోవచ్చన్నది ఈ సర్వేల సారాంశం.
మిలీనియల్స్.. మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీ, ఇండెక్స్ ఫండ్లు, ఈటీఎఫ్‌లు, స్థిరాస్తి వంటి సాధనాల్లో దీర్ఘకాలం దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టాలని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఖర్చుపై అదుపు లేకపోవడం..
సంపాదించిన దాని కంటే ఎక్కువ ఖర్చు పెట్టటం అనేది మిలీనియల్స్ చేస్తున్న పెద్ద తప్పిదమని నిపుణులు చెబుతున్నారు. ఎంత ఖర్చు చేయాలనేది తెలియకపోవటమే దీనికి కారణమని వారు అంటున్నారు.
యుక్త వయస్సులో ఉన్నప్పుడు భవిష్యత్ గురించి ఆలోచించకుండా ఖర్చు పెట్టటం ద్వారా తాత్కాలిక సంతోషం లభించినా.. ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఖర్చులు పెరగటం వల్ల ఆర్థిక స్వేచ్ఛను పొందలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
మిలీనియల్స్ సాధారణంగా వేతనం పెరిగినప్పుడు.. మంచి కారు, అపార్ట్‌మెంట్‌కు మారటం వంటివి చేస్తుంటారు. అయితే వీటి వల్ల పొదుపు పెరగదని నిపుణులు చెబుతున్నారు. అవసమైన మేర మాత్రమే ఖర్చు చేస్తూ.. మిగతాది భవిష్యత్ అవసరాలకు పొదుపు చేయాలని సూచిస్తున్నారు. ఆదాయనికి తగ్గ పెట్టుబడి, పొదుపు మార్గాలకోసం ఆర్థిక నిపుణుల నుంచి సలహాలు తీసుకోవాలని అంటున్నారు.
అత్యవసర నిధిని సమకూర్చుకోకపోవటం
జీవితం అనిశ్చితితో కూడుకున్నది. ఎప్పుడు ఏ పరిస్థితి ఉంటుందో చెప్పలేం. ఉద్యోగ కోత, అనారోగ్యం, ప్రమాదాలు తదితర అత్యవసర పరిస్థితుల్లో ఈ నిధి చాలా ఉపయోగపడుతుంది. ఆదాయం పూర్తిగా ఆగిపోయినా.. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని అందుబాటులో ఉంచుకోవాలని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
క్రెడిట్ కార్డు బిల్లులు పేరుకుపోయే వరకు వేచి ఉండటం..
మిలీనియల్స్‌లో క్రెడిట్ కార్డ్ వినియోగం సర్వ సాధారణమైపోయింది. అయితే చాలా మందికి అవసరం ఉన్నప్పుడల్లా క్రెడిట్ కార్డును స్వైప్ చేయటం అనేది అలవాటుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
సరిగ్గా వాడుకున్నట్లయితే క్రెడిట్ కార్డులు అత్యవసరాల్లో బాగా ఉపయోగపడుతాయి. కానీ మిలీనియల్స్ అన్ని అవసరాలకు క్రెడిట్ కార్డు వినియోగించడం సాధారణమైపోయిందని.. ఈ అలవాటు మార్చుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఎందుకంటే క్రెడిట్ కార్డులపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. బిల్లులు చెల్లించకుంటే.. కనీస చెల్లింపులు, వినియోగించిన మొత్తంపై వడ్డీ భారం పడుతుంటుంది. దీని ద్వారా సంపాదనలో సగం వీటిని తీర్చేందుకు సరిపోతుంది. ఈ కారణంగా పెట్టుబడులు పెట్టాల్సిన సమయం వృధా అవుతుంది అని నిపుణులు అంటున్నారు.
ఇందుకోసం.. రోజు వారీ ఖర్చులకు క్రెడిట్ కార్డును ఉపయోగించటం తగ్గించాలని, అవసరం లేని వాటిని క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయకూడదని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
రుణ చెల్లింపు ప్రణాళిక లేకపోవడం..
అప్పుల ఊబిలో చిక్కుకోవటం అతిపెద్ద సమస్య. దీనికి క్రెడిట్ కార్డును అతిగా ఉపయోగించటం వల్ల వడ్డీ, అపరాధ రుసుములు పెరుకుపోతుంటాయి. దీనితో పాటు ఇతర కారణాలూ ఉన్నాయి. ఒకసారి అప్పుల ఊబిలో చిక్కుకున్నట్లయితే దాని నుంచి బయటకు రావటం కష్టం. అప్పులను ఎలా చెల్లించాలన్న దానిపై ప్రణాళిక ఉండాలి. దానికి సంబంధించి ముందస్తుగా లెక్కలు వేసుకోవాలి. వచ్చే ఆదాయాన్ని సరిగ్గా వినియోగించుకుని అప్పులను తీర్చేందుకు ప్రణాళికలు రచించుకోవాలి.
రిటైర్మెంట్కు పొదుపు చేసుకోకపోవటం..
యుక్త వయస్సులో చాలా మంది రిటైర్‌మెంట్ గురించి ఆలోచించరు. ఎందుకంటే రిటైర్మెంట్కి చాలా సమయం ఉందిలే.. ఇప్పుడే పొదుపు ఎందుకని కొందరైతే.. దాని గురించి అసలు పట్టించుకోని వారి మరికొందరు.
ఇలా రిటైర్‌మెంట్ గురించి సంపాదన ప్రారంభం నుంచే ఆలోచించకపోవడం వల్ల భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఖర్చులు పెరుగుతాయి కాబట్టి.. భవిష్యత్ అంచనాలకు తగ్గట్లు ఉద్యోగ జీవితం ప్రారంభమైనప్పటి నుంచే రిటైర్‌మెంట్ కోసం పొదుపు ప్రణాళిక అవసరమని సూచిస్తున్నారు.
ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవటం
ఆరోగ్యం విషయంలో మిలీనియల్స్ శ్రద్ధ వహించడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య బీమా తీసుకోవడంపైనా పెద్దగా ఆసక్తి చూపడం లేదని వారంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. ఒక వేళ ఆరోగ్య సమస్యలు వచ్చినా.. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఏ ఆరోగ్య సమస్య వస్తుందో చెప్పలేం కాబట్టి.. వాటన్నింటికి తగ్గట్లు ఆరోగ్య బీమా తీసుకోవాలని అంటున్నారు.
ఇదీ చూడండి:మ్యూచువల్ ఫండ్లపై అపోహలా? అయితే ఇది మీకోసమే