బడ్జెట్ 2021-22లో ప్రకటించిన సంస్కరణలు.. భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు దోహదం చేస్తాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కె.వి.సుబ్రమణియన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి వృద్ధి రేటు 1-2 శాతం కుంగే అవకాశం ఉందన్న ఆయన.. 2021-22లో 15.5 శాతం మేర పుంజుకునేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే కంటే కూడా అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ భారత వృద్ధి రేటు అంచనాలు ఎక్కువగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా సుబ్రమణియన్ గుర్తుచేశారు.
భారత్ అత్యంత వేగంగా..
కొవిడ్ మూలంగా ప్రపంచ దేశాల ఆర్థిక వృద్ధి రేట్లు గణనీయంగా పడిపోయాయని తెలిపారు. భారత్ మాత్రం అన్నింటికంటే వేగంగా, బలంగా తిరిగి పూర్వస్థితిని చేరుకోనుందని పేర్కొన్నారు. ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఓ ప్రభుత్వ రంగ బీమా సంస్థ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగనుందని తెలిపారు. ఇది ప్రవేటు సంస్థలతో పోటీ పడనుందని తెలిపారు. వచ్చే ఏడాది కల్లా ప్రభుత్వం నిర్దేశించిన 6.8 శాతం కోశలోటు లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.