కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని 82 శాతం భారతీయులు విశ్వసిస్తున్నారు. వీరిలో అత్యధికులు డబ్బు అవసరాలను తీర్చుకునేందుకు 'పర్సనల్ లోన్స్'ను ఆశ్రయిస్తున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది.
దేశంలోని 5 వేల మంది అభిప్రాయాలను డిజిటల్ రుణాల వేదిక ఇండియాలెండ్స్ సేకరించింది.
"కరోనా విపత్తు ఆర్థిక పరిస్థితులను క్లిష్టతరం చేసిందని ఉద్యోగులు, నిపుణుల్లో 82 శాతం అంగీకరించారు. అవసరాలను తీర్చుకునేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి రుణాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యమైన ఖర్చులు.. రుణాల చెల్లింపు, వైద్య, విద్య రుసుములు ఇతర ఇంటి మరమ్మతుల అవసరాలను తీర్చుకునేందుకు 72 శాతం మంది వ్యక్తిగత రుణాలు తీసుకునేందుకు మొగ్గు చూపారు."
-ఇండియాలెండ్స్ నివేదిక
ఖర్చులు తగ్గిస్తాం..
ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 95 శాతం మంది ఖర్చుల విషయంలో జాగ్రత్త వహిస్తామని చెప్పారు. ఖర్చులు తగ్గించుకుంటున్నామని 84 శాతం మంది అంగీకరించారు. దాదాపు 90 శాతం మంది తమ సేవింగ్స్, ఆర్థిక భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు.